సోమవారం జగదీప్ ధంఖర్ ఆకస్మిక రాజీనామాతో భారత ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయింది. వైద్య కారణాలను చూపుతూ ధంఖర్ సోమవారం సాయంత్రం ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు, తక్షణమే తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. దీంతో మరోసారి ఎన్నికలు అనివార్యమయ్యాయి.
ఈ పదవికి జరగబోయే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉంది. ఉపరాష్ట్రపతిని లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు. 543 మంది సభ్యులు ఉన్న లోక్సభలో ప్రస్తుతం ఒక స్థానం మాత్రమే ఖాళీ ఉంది. 245 మంది సభ్యులు ఉండే రాజ్యసభలో 5 స్థానాలు ఖాళీ ఉన్నాయి.
లోక్సభలో పశ్చిమ బెంగాల్లోని బసిర్హాట్ ఎంపీ స్థానం ఖాళీగా ఉండగా, రాజ్యసభలో జమ్మూ కాశ్మీర్ నుంచి నాలుగు, పంజాబ్ నుంచి ఒక ఎంపీ స్థానం ఖాళీగా ఉంది. లోక్సభలో మొత్తం 542 మంది సభ్యులలో బీజేపీ కూటమికి 293 మంది సభ్యుల బలం ఉంది. రాజ్యసభలో 129 మంది సభ్యుల మద్దతు ఉంది. అధికార బీజేపీ కూటమికి మొత్తం రెండు సభల్లో కలిపి 786 మంది సభ్యుల్లో 422 మంది సభ్యుల మద్దతు ఉంది. మెజారిటీలో సగం కన్నా ఎక్కువ మద్దతు ఉంటే విజయం సాధించవచ్చు. ఈ నేపథ్యంలో ఎలాంటి రాజకీయ సమీకరణాలు లేకుండా బీజేపీ కూటమి నిలబెట్టిన అభ్యర్థి విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 68 క్లాజ్ 2 ప్రకారం.. ఉపాధ్యక్షుడి మరణం లేదా రాజీనామా లేదా తొలగింపు లేదా ఇతరత్రా కారణాల వల్ల ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి ఎన్నికలు సాధ్యమైనంత త్వరగా నిర్వహించబడుతుందని తెలిపింది. ఎన్నికైన వ్యక్తి ఆ పదవిలో 5 ఏళ్లు ఉండటానికి అర్హులు. ఉపరాష్ట్రపతి పదవి దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి.