ఔత్సాహిక ఇంజినీర్లకు గూగుల్ ఆండ్రాయిడ్ హెడ్ సమీర్ సమత్ కీలక సూచనలు చేశారు. టెక్ కంపెనీలలో ఉన్నత ఉద్యోగాలు పొందడానికి కేవలం కంప్యూటర్స్ సైన్స్ డిగ్రీ మాత్రమే సరిపోదని, అభ్యర్థులు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.
అభ్యర్థులు సాంకేతిక నైపుణ్యాలతో పాటు సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, నలుగురిలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న రంగాల్లో లోతైన విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆయన తెలిపారు.
కంప్యూటర్స్ సైన్స్ అంటే చాలామంది ‘జావా’ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం మాత్రమేనని భావిస్తున్నారని, నిజమైన కంప్యూటర్స్ సైన్స్ అంటే కేవలం కోడింగ్‌కు మాత్రమే పరిమితం కాదని ఆయన అన్నారు. అభ్యర్థులు కోడింగ్‌తో పాటు క్లిష్టమైన సమస్యలకు పరిష్కార మార్గాలు చూపడం, స్కేలబుల్ సిస్టమ్‌ల రూపకల్పన, నాయకత్వ లక్షణాల వంటి నైపుణ్యాలు కూడా అవసరమని అన్నారు.
ప్రస్తుతం ప్రాథమిక ప్రోగ్రామింగ్ పనులను కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆటోమేటిక్‌గా చేస్తున్న నేపథ్యంలో, కేవలం పేరు కోసమే కంప్యూటర్ సైన్స్ తీసుకోవద్దని సమీర్ సమత్ సూచించారు. డిగ్రీకి మించి ఆలోచించాలని, నైపుణ్యాలను పెంచుకోవాలని పేర్కొన్నారు. పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు, టీమ్ వర్క్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై దృష్టి సారించాలని ఆయన అన్నారు.