బెట్టింగ్ యాప్ల కేసు విచారణకు హాజరయ్యేందుకు సినీ నటులు రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి ఈడీని గడువు కోరారు. బెట్టింగ్ యాప్ల కేసులో విచారణకు హాజరు కావాలని వీరితో పాటు ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండలకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది.
రేపు రానా దగ్గుబాటి విచారణకు హాజరు కావాల్సి ఉండగా, షూటింగ్ నిమిత్తం సమయం కావాలని ఆయన కోరారు. షూటింగ్ బిజీ కారణంగా తన షెడ్యూల్ను మార్చాలని విజ్ఞప్తి చేశారు. మంచు లక్ష్మి ఆగస్టు 13న ఈడీ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే, తాను కూడా ఆ రోజు హాజరు కాలేనని మంచు లక్ష్మి ఈడీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారంలో ప్రకాశ్ రాజ్ జులై 30న, విజయ్ దేవరకొండ ఆగస్టు 6న ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై గతంలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. పంజాగుట్ట, మియాపూర్, సూర్యాపేట, విశాఖపట్నంలో నమోదైన కేసుల ఆధారంగా విచారణ జరుపుతోంది. 29 మంది సినీ నటులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఈడీ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ఈసీఐఆర్) నమోదు చేసింది.