AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వ్యవసాయ రంగ అభివృద్ధిపై కూటమి సర్కారు ఫోకస్..! శాటిలైట్ ద్వారా పంటల సర్వే..!

రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర చర్యలు చేపట్టారు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై నిర్వహించిన సమీక్షలో ఆయన శాటిలైట్ సర్వే ద్వారా పంటల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.

 

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం భలభద్రాపురంలో చేపట్టిన శాటిలైట్ సర్వే ఫలితాలు సమగ్ర సమాచారాన్ని అందించాయని, ఈ సమాచారాన్ని క్షేత్రస్థాయి డేటాతో సరిపోల్చాలని సూచించారు. ఒకే ప్రాంతంలో ఒకే తరహా పంటల సాగుకు రైతులకు మార్గదర్శనం అందించాలని, రైతు సేవా కేంద్రాల ద్వారా నిరంతర సహకారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ల్యాండ్ రీసర్వే తర్వాత రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనతో పాటు వ్యవసాయ రికార్డుల నవీకరణ కూడా చేపట్టాలని స్పష్టం చేశారు.

 

సమీక్షలో నాలుగు గంటలకు పైగా లోతైన చర్చ జరిగింది. రైతులకు మేలు చేసే సూచనలతో పాటు, జలవనరుల శాఖ అధికారులతో నీటి నిర్వహణపై మార్గదర్శకాలు జారీ చేశారు. అన్ని కాలువల ద్వారా నీటిని చిట్టచివరి ఆయకట్టు వరకు విడుదల చేయాలని, నాగార్జున సాగర్ కుడికాలువ ద్వారా గుంటూరు ప్రాంతానికి సాగునీరు అందించాలని ఆదేశించారు. సాగునీటి సంఘాలతో త్వరలో వర్చువల్ సమావేశాలు నిర్వహించి నేరుగా సంప్రదింపులు జరిపేందుకు సీఎం సిద్ధమయ్యారు.

 

ఏఐ చాట్ బోట్‌తో రైతులకు సహకారం: పంటల ప్రణాళిక, విలువ జోడింపు, సాంకేతిక సహకారం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్‌ను వినియోగించాలని సీఎం సూచించారు. 47.41 లక్షల మంది రైతుల ఈకేవైసీ ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద పూర్తయిందని అధికారులు తెలిపారు. ఇ-పంట ద్వారా అర్హులను గుర్తించి, ప్రతి రైతుకు ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 

ప్రకృతి సేద్యం, ఆర్గానిక్ సర్టిఫికేషన్‌పై దృష్టి: ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం వల్ల భూసారం తగ్గుతోందని, రైతులకు సరైన మార్గదర్శనం ద్వారా వీటిని నియంత్రించాలని సీఎం సూచించారు. ప్రకృతి సేద్యం, ఆర్గానిక్ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని, ఆర్గానిక్ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇవ్వడం ద్వారా జపాన్, తైవాన్ వంటి దేశాలకు ఎగుమతులు సాధ్యమవుతాయని తెలిపారు. టాటాతో ఒప్పందం ద్వారా ఈ ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, డ్రోన్ల వినియోగం ద్వారా పురుగుమందుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు.

 

మొబైల్ రైతు బజార్లు, సూక్ష్మ సేద్యం: నగరాల్లో అపార్ట్‌మెంట్ల వద్ద మొబైల్ రైతు బజార్ల ఏర్పాటుతో ఉత్పత్తులను నేరుగా విక్రయించేలా చర్యలు తీసుకోవాలని, 30 రోజుల్లో కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. సూక్ష్మ సేద్యం ద్వారా ఉద్యాన పంటల సాగును విస్తరించాలని, రాయలసీమలో కాలువలతో పాటు మైక్రో ఇరిగేషన్‌ను ప్రోత్సహించాలని సూచించారు.

 

మత్స్య, పశుసంపద రంగాలకు ప్రాధాన్యత: మత్స్యకారులకు సముద్ర మత్స్య సంపద వివరాలను యాప్ ద్వారా అందించాలని, సీవీడ్ సాగును ప్రోత్సహించాలని సీఎం సూచించారు. ఆక్వా ఉత్పత్తుల నాణ్యతపై రాజీ లేకుండా, అంతర్జాతీయ ప్రమాణాలు పాటించే రైతులకు సబ్సిడీలు అందించాలని ఆదేశించారు. పశుసంపద రంగంలో 15 శాతం వృద్ధిని లక్ష్యంగా నిర్దేశించారు.

 

‘కోకో ముంజ్’పై ముఖ్యమంత్రి ప్రశంసలు: కొబ్బరితో తయారు చేస్తున్న ‘కోకో ముంజ్’ సంస్థ ఉత్పత్తులను పరిశీలించిన ముఖ్యమంత్రి… సంస్థ ప్రతినిధిని అభినందించారు. ఈ సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయం-అనుబంధ రంగాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ANN TOP 10