తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీపై కీలక ప్రకటన చేశారు. ఇది నిరంతర ప్రక్రియ అని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం సచివాలయం వేదికగా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కలెక్టర్లు, అధికారులు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలలో పాల్గొనాలని ఆదేశించారు.
ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 10 వరకు రేషన్ కార్డులను పంపిణీ చేయాలని సూచించారు. మంత్రులు బాధ్యత తీసుకొని స్థానిక ఎమ్మెల్యేలను కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని అన్నారు. ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తోందని, దీనితో రేషన్ కార్డులకు కూడా డిమాండ్ పెరిగిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చినట్లు తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లో రేషన్ కార్డుల పంపిణీ జరగాలని అన్నారు.
రేషన్ కార్డులతో పాటు వర్షాలు, వానాకాలం, పంటసాగు, సీజనల్ వ్యాధుల అంశాలపై కూడా ఆయన సమీక్ష నిర్వహించారు. ఎరువులు దొరకడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఏ దుకాణంలో ఎంత స్టాక్ ఉందో బయట నోటీసు బోర్డులో పెట్టాలని సూచించారు. ఎరువుల దుకాణాలపై పోలీసులు, అధికారులు నిఘా పెట్టాలని సూచించారు. ఎరువుల దారి మళ్లింపును అడ్డుకునే బాధ్యత కలెక్టర్లదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో సరిపడా ఎరువులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
రాయితీ ఎరువులను ఇతర అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఖర్చు చేసేందుకు కలెక్టర్లకు రూ. 1 కోటి చొప్పున కేటాయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.