AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విమానం కాక్‌పిట్‌లో నాగుపాము…

అయినా సురక్షితంగా ల్యాండింగ్!

జోహన్నెస్‌బర్గ్: అత్యంత విషపూరిత ‘కేప్ కోబ్రా’(నాగుపాము) విమానం ఎగురుతుండగా మార్గమధ్యంలో కాక్‌పిట్‌లో తల పైకెత్తింది. భయానక వాతావరణం…అయినా దక్షిణాఫ్రికా పైలట్ రుడాల్ఫ్ ఎరాస్మస్ అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీనిని వైమానిక నిపుణులు కొనియాడారు. ఎరాస్మస్ గత ఐదేళ్లుగా విమానాలు నడుపుతున్నారు. అతడు విమానం నడుపుతున్నప్పుడు నాగుపాము తలెత్తడమేకాక, అతడి సీటు కిందికి పాక్కుంటూ పోయింది. అతడు ఆ చిన్న విమానాన్ని వోర్‌సెస్టర్ నుంచి నెల్స్‌ప్రూట్ వరకు నలుగురు ప్రయాణికులతో వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

‘నేను సాధారణంగా నా కాళ్ల దగ్గర నీళ్ల బాటిల్‌ను పెట్టుకుని ప్రయాణిస్తుంటాను. నాకు కాళ్ల దగ్గర చల్లగా అనిపించింది. నేను నీళ్ల బాటిల్ కారుతోందేమో అనుకున్నాను. కానీ కిందికి తొంగిచూస్తే నా సీటు కింది నాగుపాము తలపెట్టుకుని ఉంది’ అని ఎరాస్మస్ తెలిపాడు. అప్పుడు దిగ్భ్రాంతికి గురైన తాను నిశబ్దంగా ఉండిపోయానన్నారు. విమానం వెల్‌కోమ్ విమానశ్రయం దగ్గర ఉండగా ఆయన విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. జోహన్నెస్‌బర్గ్ కంట్రోల్ టవర్‌కు ఎమర్జెన్సీని ప్రకటించాడు

‘నేను నా సీటును ముందుకు రోల్ చేశాను. పాము సీటు కింద ముడుచుకుని పడుకుని ఉంది. పాములు పట్టే వాళ్ల కోసం నేను కాంటాక్ట్ చేశాను. కానీ వారు వచ్చేలోగా ఆ పాము కనుమరుగైపోయింది’ అని ఎరాస్మస్ తెలిపాడు. వైమానిక స్పెషలిస్ట్ బ్రియాన్ ఎమ్మెనీస్ పైలట్ చాకచక్యాన్ని మెచ్చుకున్నారు. తన నాలుగు దశాబ్దాల సర్వీసులో ఇలాంటి కేసు ఎదురుపడలేదని ఎమ్మెనీస్ అన్నారు. ఒకవేళ నాగుపాము పైలట్‌ను కరిచి ఉంటే అతడు చనిపోయి ఉండేవాడని కూడా అన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10