వరల్డ్ చాంపియన్‌షిప్ రెండో ఎడిషన్‌లో జరగాల్సిన ఇండియా-పాక్ మ్యాచ్‌పై సందిగ్ధత నెలకొంది. షాహిది అఫ్రిది నేతృత్వంలోని జట్టుతో తలపడేందుకు ఐదుగురు భారత ఆటగాళ్లు ససేమిరా అన్నట్టు తెలిసింది. పాకిస్థాన్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఇటీవల భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు పాక్ మిలటరీకి సంఘీభావంగా ఆర్మీ శిబిరాలను సందర్శించాడు. అంతేకాదు, సోషల్ మీడియాలో పలువురు భారత క్రికెటర్లపైనా నోరు పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడి నేతృత్వంలోని జట్టుతో ఆడేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించినట్టు సమాచారం. వీరిలో ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ ఉన్నారు. ప్రత్యర్థి జట్టులో అఫ్రిది ఉంటే తాము ఆడేది లేదని నిర్వాహికులకు చెప్పినట్టు తెలిసింది.
ఆరు దేశాల పాల్గొనే వరల్డ్ చాంపియన్‌షిప్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) టోర్నీలో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత పరిణామలు, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్ నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిజానికి ఈ మ్యాచ్ నేడు బర్మింగ్‌హామ్‌లో జరగాల్సి ఉంది. పహల్గామ్ దాడి తర్వాత ఇరు దేశాలు తలపడుతున్న తొలి మ్యాచ్ ఇదే. అయితే, భారత్-పాక్ మ్యాచ్ బాయ్‌కాట్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని, మ్యాచ్ యథావిధిగా జరుగుతుందని నిర్వాహకులు చెప్పడం గమనార్హం. కాగా, డబ్ల్యూసీఎల్ గతేడాది ఎడిషన్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన భారత్.. టైటిల్‌ను అందుకుంది.