మతమార్పిళ్ల వ్యవహారంలో అరెస్ట్ అయిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన చంగూర్‌బాబా అలియాస్ జమాలుద్దీన్ అలియాస్ పీర్‌బాబా లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న వారిని, వితంతువులను లక్ష్యంగా చేసుకుని నయానో, భయానో వారిని ఇస్లాంలోకి మార్చిన అతడి చీకటి గాధలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
మనిషిని బట్టి, కులాన్ని బట్టి వారికి రేటు కట్టేవాడు. ఈ క్రమంలో అతడు కోట్లకు పడగలెత్తాడు. తన దందాలు బయటపడకుండా ఉండేందుకు ఆరెస్సెస్ పేరును వాడుకున్నాడు. నాగ్‌పూర్ కేంద్రంగా ఉన్న భారత్ ప్రతికార్త్ సేవా సంఘ్ అవధ్ విభాగం ప్రధాన కార్యదర్శినని చెప్పుకొని తిరిగేవాడు. అంతేకాదు, తన లెటర్హెడ్లపై మోదీ ఫొటోను ముద్రించుకున్నాడు. ఇలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని మతమార్పిళ్లు చేసేవాడు.
ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లాలో అక్రమ మతమార్పిళ్ల రాకెట్‌ను ఛేదించిన ఆ రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఈ నెల 6న చంగూర్‌బాబా, ఆయన అనుచరులను అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో మరిన్ని విషయాలు వెలుగు చూశాయి. బ్రాహ్మణ మహిళను ఇస్లాంలోకి మారిస్తే రూ. 16 లక్షలు, సిక్కు, క్షత్రియ మహిళలైతే రూ. 12 లక్షలు, ఓబీసీ మహిళలు అయితే రూ. 10 లక్షలు చొప్పున నజరానాలు ఇచ్చేవాడు.
ఈ నేపథ్యంలో అతడికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి సమకూరిందన్న దానిపై ఈడీ దృష్టి సారించింది. ఈ క్రమంలో ఇస్లామిక్ దేశాల నుంచి అతడికి పెద్ద మొత్తంలో డబ్బులు అందినట్టు గుర్తించింది. అతడి 40 బ్యాంకు ఖాతాల్లో రూ. 106 కోట్లను గుర్తించారు. ఒకప్పుడు రెహ్రా మాఫీ గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన చంగూర్‌బాబా ఆ గ్రామ శివారులో దర్గా పక్కన నిబంధనలకు విరుద్ధంగా 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ భవనం నిర్మించాడు. అయితే, అధికారులు దానిని కూల్చివేశారు. అంతేకాదు, విదేశాల నుంచి అందిన సొమ్ముతో అతడు ఉగ్రవాద శిక్షణ శిబిరాన్ని కూడా నడిపినట్టు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.