AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బ్రహ్మపుత్ర నదిపై చైనా ‘మెగా డ్యామ్‌’ నిర్మాణం..

ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన జ‌ల విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని డ్రాగ‌న్ కంట్రీ చైనా శ‌నివారం ప్రారంభించింది. టిబెట్, భారత్‌ గుండా ప్రవహించే బ్రహ్మపుత్ర నదిపై చైనా ఈ మెగా-ఆనకట్ట నిర్మాణాన్ని మొద‌లుపెట్టింది. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి చైనా ప్రధాని లి కియాంగ్ హాజరయ్యారని అక్క‌డి మీడియా తెలిపింది.

 

టిబెట్‌లోని యార్లుంగ్ త్సాంగ్పో (బ్రహ్మపుత్ర) నదిపై ఈ ప్రాజెక్టును బీజింగ్ డిసెంబర్‌లో ఆమోదించింది. “ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తు ప్రధానంగా వినియోగం కోసం ఇతర ప్రాంతాలకు ప్రసారం చేయడం జ‌రుగుతుంది. అదే సమయంలో టిబెట్‌లోని స్థానిక విద్యుత్ అవసరాలను కూడా తీరుస్తుంది” అని ఆగ్నేయ టిబెట్‌లోని నైంగ్చిలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమం తర్వాత వార్తా సంస్థ జిన్హువా నివేదించింది.

 

కాగా, ఈ ప్రాజెక్టు నిర్మాణంపై భార‌త్‌, బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న‌ డ్రాగ‌న్ కంట్రీ మాత్రం మొండిగా ముందుకు వెళ్ల‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే ఇది ఇరు దేశాల్లోని దిగువన ఉన్న లక్షలాది మంది ప్రజలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.

 

టిబెట్‌లోని ఈ ప్రాజెక్టు గురించి జనవరిలో చైనాతో ఆందోళన వ్యక్తం చేశామని భార‌త్ తెలిపింది. దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి పర్యవేక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. “బ్రహ్మపుత్ర నది దిగువ ప్రాంతాలలో జరిగే కార్యకలాపాల వల్ల దాని దిగువ ప్రాంతాల ప్రయోజనాలకు హాని కలగకుండా చూసుకోవాలని చైనాను కోరడం జరిగింది” అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

 

పర్యావరణపరంగా సున్నితమైన టిబెటన్ పీఠభూమిలో ఇటువంటి మెగా ప్రాజెక్టుల కోలుకోలేని ప్రభావం గురించి దిగువ ప్రాంతాల ఆందోళనలతో పాటు, పర్యావరణవేత్తలు కూడా హెచ్చరించారు.

 

ఇక‌, ఈ ప్రాజెక్టులో భాగంగా చైనా ఐదు జలవిద్యుత్ కేంద్రాలను నిర్మించాల్సి ఉంటుందని, మొత్తం పెట్టుబడి దాదాపు 1.2 ట్రిలియన్ యువాన్లు (సుమారు రూ.14ల‌క్ష‌ల కోట్లు) ఉంటుందని జిన్హువా తెలిపింది.

ANN TOP 10