ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తిరుపతిలో పర్యటించారు. నగరంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పరిశుభ్రత ప్రాధాన్యతను వివరించారు. పరిసరాలే కాకుండా సమాజం కూడా క్లీన్ గా ఉండాలన్నారు.
“రాజకీయాలు కలుషితమయ్యాయి. నేర చరిత్ర ఉన్నవారు రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజల ఆస్తులను కబ్జా చేస్తున్నారు. మీ ఇంట్లో చెత్తను ఊడ్చేసినట్లుగానే రాజకీయాల్లో ఉన్న మలినాన్ని కూడా క్లీన్ చేయాలి. నేర రాజకీయాలు మనకు అవసరమా? వాటిని అడ్డుకోలేమా? ప్రజలు ఆలోచన చేయాలి. 2019 ఎన్నికలకు ముందు నేను మోసపోయాను. సాక్షి అని ఒక పత్రిక పెట్టారు. దాంతో చేసేవన్నీ వెధవ పనులే. పేరు మాత్రం సాక్షి. బాబాయ్ గుండెపోటుతో చనిపోయాడని సాక్షిలో వేశారు. సాయంత్రానికి గొడ్డలిపోటు అని డ్రామాలాడారు. చివరకు నారాసుర చరిత్ర అని నా చేతిలో కత్తి పెట్టి పత్రికలో రాశారు. ప్రజలు అయ్యో పాపం అనుకున్నారు. మళ్లీ మళ్లీ మోసం చేస్తే మనం మోసపోవాలా?” అని సీఎం ప్రశ్నించారు.
చిత్తూరులో పులివెందుల రాజకీయం
ఇటీవల బంగారుపాళ్యం రైతుల దగ్గరకు వచ్చి హడావుడి చేశాడు. మన ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే సదుద్ధేశంతో టన్ను మామిడికి టన్నుకు రూ.12 వేలు ఇచ్చేలా చేసింది. ప్రభుత్వం తరపున రూ.4 వేలు, కొనుగోలుదారులు రూ.8 వేలు చెల్లించే ఏర్పాట్లు చేశాం. రైతుల పరామర్శకు వచ్చి రోడ్లపై మామిడి పండ్లు పోసి పులివెందుల రాజకీయం చేశాడు. హత్యా రాజకీయాలు నా జీవితంలో లేవు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని, ప్రజలకు భద్రతకు కల్పించాలని భావించాను. హింసా రాజకీయాలు నా దగ్గర కుదరవు. గత ఐదేళ్లలో ప్రజలకు స్వేచ్ఛ లేదు. ఎన్డీఏ వచ్చాక ప్రజలు సంతోషంగా ఉన్నారు.
ప్రాజెక్టులు పూర్తిచేసి రుణం తీర్చుంటా
రాయలసీమకు నీళ్లు తెచ్చింది టీడీపీనే. హంద్రినీవా, నగరి, గాలేరు, తెలుగుగంగ ప్రారంభించింది ఎన్టీఆర్ . తెలుగుగంగ ద్వారా తిరుపతికి నీరు అందించాం. తిరుపతిలో గరుడ వారధి నిర్మించి మేమే. వారధిని అలిపిరి వరకూ తీసుకెళితే, ఆ దుర్మార్గులు మధ్యలో ఆపే ప్రయత్నం చేశారు. అవిలాల చెరువు సుందరీకరణను అడ్డుకున్నారు. రూ.3,850 కోట్లతో హంద్రీనీవా పనులు చేసి నీళ్లు విడుదల చేశాను. త్వరలో కుప్పం వరకూ నీరు అందిస్తాం. వెంకన్న చెంతకు హంద్రీనీవా నీరు వస్తుంది. మల్లెమడుగు ప్రాజెక్టు, బాలాజీ రిజర్వాయర్ రావాలి. మూలపేట చెరువు, కల్యాణ డ్యామ్‌కు నీళ్లు తీసుకొస్తాం. సోమశిల , స్వర్ణముఖి లింక్ కెనాల్ తీసుకొచ్చి వాటిని బాలాజీ రిజర్వాయర్‌కు కలుపుతాం. వీటిమధ్యలో వేణుగోపాల సాగర్ వస్తుంది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి నేను పుట్టిన చిత్తూరుజిల్లా రుణం తీర్చుకుంటా.
పేద పిల్లలకు కుటుంబ పెద్దగా ఉంటా
రాష్ట్రంలో 15 లక్షల నుంచి 20 లక్షల పేదకుటుంబాలను పైకి తీసుకురావాలన్న సంకల్పంతో ముందుకెళుతున్నాం. 2029 నాటికికి పేదరికం లేని రాష్ట్రంగా ఏపీ ఆవిష్కృతం కావాలన్నది నా ఆశయం. ఈ పీ4 కార్యక్రమం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది. ఆ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో పీ4 కార్యక్రమం సాకారమవుతుంది. బంగారం లాంటి పిల్లలకు చేయూతనిస్తే వారిలో విశ్వాసం పెరిగి మరో 10 మందికి సాయం చేసే శక్తి వస్తుంది. పిల్లలకు అవకాశం కల్పించే బాధ్యత నాది… పైకొచ్చే బాధ్యత వారిది. ఇంతకంటే సంతోషం మరొకటి ఉండదు. నిన్ననే 40 మంది పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యాను. వారు వేల కుటుంబాలను దత్తత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు… అని సీఎం చంద్రబాబు అన్నారు.