మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన పాపాల కారణంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) నుంచి తనకు నోటీసులు వచ్చాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ నెల 24న ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇవ్వాలంటూ జూబ్లీహిల్స్ ఏసీపీ ఆయనకు లేఖ రాశారు. స్టేట్‌మెంట్ ఇవ్వడానికి హైదరాబాద్‌లోని లేక్ వ్యూ అతిథి గృహానికి రావాలని సూచించారు.
ఈ లేఖపై బండి సంజయ్ స్పందిస్తూ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసుల నుంచి తనకు నోటీసులు వచ్చినట్లు తెలిపారు. తనతో పాటు తన కుటుంబం, సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. పడకగదిలో దంపతుల మాటలను కూడా ట్యాప్ చేసి జీవితాలను నాశనం చేశారని మండిపడ్డారు. తనకు తెలిసిన, తన వద్ద ఉన్న సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని ఆయన అన్నారు.
