తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల అంశం చర్చకు రాలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొనగా, ఆయన మాటలకు, చేతలకు పొంతన లేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఈ రోజు జరిగిన సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టే మొదటి అంశమని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ, బనకచర్ల ప్రాజెక్టుతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికే కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీల రిమోట్ పాలన కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. ఈ రోజు సమావేశం అనంతరం కమిటీ నిర్ణయానికి రేవంత్ రెడ్డి అంగీకరించడం సముచితం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
బనకచర్లపై కేంద్రం సమావేశం ఏర్పాటు చేయడమే తప్పని, ముఖ్యమంత్రి పాల్గొనడం మరో తప్పని హరీశ్ రావు అన్నారు. నాలుగు కేంద్ర సంస్థలు తిరస్కరించిన ప్రతిపాదనపై సమావేశం ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తూ ముఖ్యమంత్రి మరణ శాసనం రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.