AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కామారెడ్డి జిల్లాలో పెద్దపులి టెన్షన్..!

కామారెడ్డి జిల్లాలో పెద్దపులి టెన్షన్ గ్రామస్థులకి నిద్ర పట్టకుండా చేస్తోంది. రామారెడ్డి మండలం రెడ్డిపేట్‌ స్కూల్‌ తండా అటవీశివారులో ఆవుపై పులి దాడిచేయగా.. జాడ కనుగొనేందుకు అటవీశాఖాధికారులు రంగంలోకి దిగారు. గతంలోనూ ఇక్కడ పులుల సంచారం ఉండటంతో ప్రజలు నెలల తరబడి భయంలో గడిపారు. ప్రస్తుతం పగటిపూట కూడా బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు దీంతో అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టి, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. రైతులు, పశువుల కాపరులు ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని అధికారులు తండా వాసులను హెచ్చరిస్తున్నారు.

గత కొన్నేళ్లుగా అడపాదడపా పులులు కనిపించడం, పశువులపై దాడులు చేయడం వంటి ఘటనలు జరుగుతునే ఉన్నాయి. 2023లో ఇదే జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పులి సంచారం తీవ్ర కలకలం రేపింది. ఆ సమయంలో ప్రజలు నెలల తరబడి భయం గుప్పిట్లో గడిపారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు పొలాలకు వెళ్లాలన్నా.. పశువులను మేపడానికి తీసుకెళ్లాలన్నా.. భయపడే పరిస్థితి ఏర్పడింది. తాజాగా పులి సంచారంతో ప్రజలు పగటిపూట కూడా ఒంటరిగా బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. ఈ ఘటనలతో ప్రజల్లో పులి భయం తిరిగి మళ్లీ మొదలైంది.

ఇంతకీ ఆవును చంపితిన్న పులి ఇప్పుడు ఎక్కుడ ఉందనేది ఉత్కంఠగా మారింది. సిరికొండ మీదుగా రామారెడ్డి, మాచారెడ్డి ప్రాంతాల్లోని అడవుల్లో పులి సంచరిస్తున్నట్లుగా అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. పులి దాడిలో చనిపోయిన ఆవును ఆధారంగా చేసుకుని పులి చాలా ఆకలితో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. పాదముద్రలను సేకరించి పులిగా నిర్ధారించిన అటవీశాఖ అధికారులు . పెద్దపల్లి కోసం బోన్లు, ట్రాక్ కెమెరాలు ఫిక్స్ చేసి రెస్క్యూ కొనసాగిస్తున్నారు. రామారెడ్డి, మాచారెడ్డి అడవుల్లోనే పెద్ద పులి దాగి ఉన్నట్లుగా అటవీ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ, అక్కడి నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా అటవీ భూభాగంలోకి పులి వెళ్లే అవకాశాలూ కనిపిస్తున్నాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని అడవులు పెద్ద పులులకు సహజ ఆవాసంగా ఉన్నాయి. దట్టమైన వృక్ష సంపద, సమృద్ధిగా ఆహార వనరులు, అనుకూలమైన పర్యావరణ పరిస్థితులను కలిగి ఉన్న ప్రాంతం కాబట్టి పులులు ఎక్కువుగా ఉమ్మడి ఆదిలాబాద్‌ అడవుల్లో సంచరించే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు పెద్దపులిపై విష ప్రయోగం జరిగినందువల్ల పెద్దపులి అస్వస్థతకు గురయ్యే అవకాశం కూడా ఉందని అధికారులు భావిస్తున్నారు. అదే ప్రాంతంలో పెద్దపులి వాంతులు చేసుకుందని కోణం లో కూడా రిస్క్యూ, గాలింపు చర్యలు, కొనసాగుతున్నాయి. నాలుగు రోజులగా పెద్దపులి ఆచూకీ లభించకుపోవడం , దీనిపై ఫారెస్ట్ అధికారులు కూడా క్లారిటీ ఇవ్వక పోవడంతో స్థానికులు భయాందోళనకు గురైవుతున్నారు. నాలుగు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టిన పులి జాడ ఎక్కడ కన్పించకపోవడంతో అడవిలోకి వెళ్లిపోయి ఉంటుందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.

ఆవు మృతిచెందడంతో పులిని చంపడానికి ఆవు యజమానితోపాటు మరో ముగ్గురు ఆవు కళేబరంపై పురుగుల మందు చల్లారు. దీనిని అటవీశాఖ అధికారులు గుర్తించగా, విష ప్రయోగం చేసిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టు చేసినవారిలో స్కూల్‌ తండాకు చెందిన భుక్య మహిపాల్‌, గంగావత్‌ కన్నెరాం, సాలవాత్‌ గోపాల్‌, పిపావత్‌ సంజీవ్‌ ఉన్నారు. వన్యమృగాలపట్ల క్రూరంగా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

రైతుల అరెస్ట్ పై గ్రామస్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వదేనని గ్రామస్థులు అంటున్నారు. పెద్దపులిని గుర్తించి తమకు దైర్యం కల్పించాలని తండా వాసులు అధికారులును వేడుకుంటున్నారు.

ANN TOP 10