రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నీటి వాటాలపై.. ఢిల్లీ వేదికగా నేడు కీలక సమావేశం జరగబోతోంది. ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరుకానుండటంతో.. ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలకు పిలుపు వచ్చింది. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఈ భేటీలో కృష్ణా, గోదావరి జలాల నీటి వివాదాలపై చర్చించనున్నారు. ఇందులో ప్రధాన అంశంగా బనకచర్ల ప్రాజెక్టుపై డిస్కష్ చేయనున్నారు. దీంతో అలర్ట్ అయిన తెలంగాణ ప్రభుత్వం బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేనే లేదని.. వెంటనే ఎజెండాను సవరించాలని కేంద్ర జలశక్తి కార్యదర్శికి లేఖ రాసింది.
నేడు ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీలో నీటి పంపకాలే ప్రధాన ఎజెండాగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఈ మీటింగ్ నిర్వహిస్తున్నారు. అయితే సీఎంల భేటీలో తెలంగాణ ప్రయోజనాలపై ఏ మేరకు గళం వినిపిస్తారు? ఏపీని ఎలా అడ్డుకుంటారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమావేశంలో నీటి వాటాలపై వాదన వినిపిస్తారా? లేకుంటే చంద్రబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అన్నదే అసలు పాయింట్. కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన వాటిని ఎలా సాధిస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎం భేటీ కానున్నారు. ఇందులో తెలంగాణ ప్రాజెక్టులు, అనుమతులు, నిధులు కేటాయింపు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు లాంటి అంశాలపై చర్చించనున్నారు. బనకచర్లపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయనున్నారు. మరోవైపు ఆయనతో పాటుగా పలువురు కేంద్రమంత్రులను కలవనున్నట్లు తెలుస్తోంది.
మధ్యాహ్నం బనకచర్ల, నీటిపారుదల ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో అపెక్స్ కమిటీ సమావేశంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి పాల్గొంటారు . ఈ సమావేశంలో బనకచర్లను అజెండా నుంచి తొలగించాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. రేపు కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం రేవంత్ కలుస్తారు. ఈ రోజు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సూక్ మాండవీయతోపాటు చంద్రబాబు భేటీ అవుతారు. సాయంత్రం నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు. రాత్రి CII సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు హాజరవుతారు.