కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మధ్య అనధికారిక ఒప్పందం నడుస్తోందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. ఇటీవల ముగ్గురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు… మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం కవితకు వచ్చిందని… ఇది నిజమో కాదో కాంగ్రెస్ పెద్దలే చెప్పాలని అన్నారు.
అగ్రకులాల వాళ్లంతా ఏకమై తమపై (బీసీలు) దాడి చేయాలని చూస్తున్నారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. బీసీలందరూ ఏకమై రాజకీయ పార్టీగా ముందుకొస్తామని… రాష్ట్రంలో అధికారాన్ని చేపడతామని చెప్పారు. రాష్ట్రంలో బీసీలంతా ఒకవైపు… కల్వకుంట్ల కుటుంబం మరోవైపు అని అన్నారు. తన మీద వారి మనుషులను ఉసిగొలిపి తనపై కవిత హత్యాయత్నం చేశారని మండిపడ్డారు. తన మీద, తన కార్యాలయం మీద దాడి చేసిన సుజిత్ రావు కవిత బంధువేనని చెప్పారు.
తనపై జరిగిన దాడిని బీఆర్ఎస్ నేతలు కూడా స్వాగతించలేదని అన్నారు. కానీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర కాంగ్రెస్ పెద్దలు ప్రెస్ మీట్ పెట్టి కవితకు మద్దతుగా మాట్లాడారని విమర్శించారు. మరోవైపు తీన్మార్ మల్లన్నకు ‘వై ప్లస్ కేటగిరీ’ భద్రతను కల్పించాలని మున్నూరు కాపు సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. ఆయనపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్టు ఐక్య వేదిక నేతలు తెలిపారు.