AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వైసీపీ నేతల్లో వణుకు మొదలైందా..? కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసిపి నేతలు..!

వైసీపీ నేతల్లో వణుకు మొదలైందా? జగన్ వెంట వచ్చి నానా హంగామా చేసిన నేతలపై కేసులు నమోదు అవుతున్నాయా? పోలీసులను బెదిరించే ప్రయత్నం వైసీపీ చేస్తోందా? పార్టీలో క్రియాశీలకంగా ఉన్నవారిపై ప్రభుత్వం కేసులు పెడుతోందా? అవుననే అంటున్నారు మాజీ మంత్రి పేర్ని నాని.

 

వైసీపీలో కొత్త టెన్షన్ మొదలైంది. జూన్, జులై నెలలో వివిధ ప్రాంతాలకు వెళ్లారు వైసీపీ అధినేత జగన్. ఆ సమయంలో ఆ పార్టీ కేడర్ రెచ్చిపోయింది. వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కేసులు నమోదు కావడంతో చాలామంది నేతలు పత్తా లేకుండా పోయారు. కొందరు కార్యకర్తలు హడలిపోతున్నారు.

 

గతవారం కృష్ణాజిల్లాలో జరిగిన ఘటనలో జెడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక భర్త రాముపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. నాగవరప్పాడు వంతెన సమీపంలో టీడీపీ మహిళా నేత సునీతను జెడ్పీ ఛైర్ పర్సన్ హారిక కారు ఢీ కొట్టింది. బాధితురాలు సునీత ఫిర్యాదు మేరకు రాముపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

జగన్ మాదిరిగా పోలీసు లను బెదిరించే ప్రయత్నం చేశారు మాజీ మంత్రి పేర్ని. ఇది తప్పుడు కేసులు, సైకో ప్రభుత్వమని దుమ్మెత్తిపోశారు. రాము మీద కేసు నమోదు చేసి అరెస్టు చేస్తే తప్పుడు కేసు నమోదు చేసిన పోలీసులను సుప్రీంకోర్టు ఈడ్చుతామని మండిపడ్డారు.

 

గుడివాడ‌లో అల్లర్లు సృష్టించాలని టీడీపీ ప్రయత్నించిందన్నారు. గంజాయి, మందు తాగించి అల్లర్లకు కొందరి వ్యక్తులను పంపిందన్నారు. జెడ్పీ చైర్మన్ మీద దాడి చేయించింది టీడీపీ వాళ్ళు కాదా? అంటూ ప్రశ్నించారు. గొడవలు సృష్టించినవారే తిరిగి కేసులు పెడుతున్నారని అన్నారు.

 

రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతోందన్నారు మాజీ మంత్రి. వైసీపీలో క్రియాశీలకంగా ఉన్నవారిపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ డైరెక్షన్‌లో తప్పుడు కేసులు పెడుతున్నా రని ఆరోపించారు. ఆమె కొడాలి నాని ఫ్లెక్సీ‌ని చింపే క్రమంలో మహిళా నేత చేతికి గాయం అయ్యిందన్నారు. కారుతో గుద్దారని తప్పుడు ఫిర్యాదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

పరిశ్రమలు అదిగో ఇదిగో వచ్చేస్తున్నాయని అంటున్నారని, 13 నెలలుగా పరిశ్రమల శాఖకు కమిషనర్ లేరన్నారు పేర్నినాని. అభివృద్ధిపై కూటమి తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అటు వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీపైనా విరుచుకుపడ్డారు. క్వార్ట్జ్ మైనింగ్‌లో సంపాదనలో కొంత భాగం కొల్లు రవీంద్ర‌కు పంపిస్తున్నారంటూ కొత్త పల్లవిని ఎత్తుకున్నారు. అందుకే ప్రశాంతి మహా తల్లి అయ్యిందన్నారు.

ANN TOP 10