ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్యులకు డ్రోన్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సోమవారం ఒక కొత్త పోర్టల్‌ను ప్రారంభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ‘ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్’ ప్రారంభమైంది. ఈ పోర్టల్‌ను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది. వ్యవసాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, విపత్తు నిర్వహణ వంటి వివిధ రంగాల్లో డ్రోన్ సేవలను అందించడమే దీని లక్ష్యం. ఆధునిక టెక్నాలజీ సామాన్యులకు చేరువ చేయడమే ఈ పోర్టల్ లక్ష్యం.
ఈ పోర్టల్ ద్వారా రైతులు తమ పొలాల్లో పురుగుమందులు చల్లడం, పంటల పరిశీలన వంటి వ్యవసాయ అవసరాల కోసం డ్రోన్‌లను ఉపయోగించవచ్చు. అంతేకాకుండా, భూమి సర్వేలు, పెద్ద ప్రాజెక్టుల సైట్ పర్యవేక్షణ, భద్రతా నిఘా, మ్యాపింగ్ వంటి సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంతకు ముందు ఈ సేవలు కేవలం ప్రత్యేక సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ, ఇప్పుడు ఈ పోర్టల్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోని ప్రజలు, సంస్థలు ఈ సేవలను పొందవచ్చు.
ధృవీకరించబడిన డ్రోన్ సేవా ప్రదాతలతో వినియోగదారులను ఈ ప్లాట్‌ఫామ్ నేరుగా కలుపుతుంది. సామాన్యులు లేదా ప్రభుత్వ విభాగాలు తమకు అవసరమైన సేవలను సులభంగా అభ్యర్థించవచ్చు. వినియోగదారులు సేవా ప్రదాతలతో ధరల గురించి చర్చించి, సరసమైన ధరలకు పొందవచ్చు. ఈ సేవలు అందరికీ సరసమైనవిగా ఉండాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. భవిష్యత్తులో ఈ పోర్టల్‌లో మరిన్ని సేవలను చేర్చేందుకు అభివృద్ధి చేయాలని కూడా ఆయన సూచించారు.
డ్రోన్ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి తీసుకురావడం వల్ల వివిధ రంగాల్లో, ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం అవుతుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ పోర్టల్ ఆవిష్కరణ కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్, ఐటీ సెక్రటరీ కాటన్నేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
గత ఏడాది నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రోన్ విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం రాష్ట్రాన్ని డ్రోన్ టెక్నాలజీకి ప్రపంచ కేంద్రంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే ఐదేళ్లలో 100 డ్రోన్ తయారీ యూనిట్లను స్థాపించడం, రూ. 1000 కోట్ల పెట్టుబడిని ఆకర్షించడం ప్రభుత్వ పాలసీ టార్గెట్. ఈ విధానం కింద ఏర్పాటైన స్టేట్ డ్రోన్ కార్పొరేషన్ డ్రోన్ వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు, అత్యవసర సేవలు, ఇతర సేవలను వేగవంతం చేయడానికి పనిచేస్తుంది.
ఈ విధానం 40,000 మందికి ఉపాధి, 25,000 మందికి డ్రోన్ పైలట్ శిక్షణ అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. పెట్టుబడిదారులకు 20 శాతం సబ్సిడీ కూడా అందిస్తున్నారు. ఈ పోర్టల్ ద్వారా డ్రోన్ సేవలు సామాన్యులకు సులభంగా అందుబాటులో ఉండటంతో, రైతుల నుండి వ్యాపారవేత్తల వరకు అందరూ ఈ సాంకేతికతను ఉపయోగించుకోవచ్చు. ఈ చర్య ఆంధ్రప్రదేశ్‌ను సాంకేతిక అభివృద్ధిలో ముందంజలో నిలుపుతుంది.