ఏపీకి తెలంగాణ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. బనకచర్ల ప్రాజెక్టు వ్యవహారంపై ఏపీతో చర్చలు జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం నో చెప్పింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. ఈ ప్రాజెక్టుపై జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ అభ్యంతరాలు తెలిపాయని ప్రస్తావించింది.
ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు రాలేదని పేర్కొంది. చట్టాలు, ట్రిబ్యునల్ తీర్పులను ఉల్లంఘించినందున బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో బనకచర్ల ప్రాజెక్టుపై సమావేశానికి బుధవారం ఢిల్లీలో ఏర్పాట్లు చేసింది కేంద్రం. బనకచర్ల సింగిల్ ఎజెండా తో సమావేశానికి ప్రతిపాదన చేసింది ఏపీ ప్రభుత్వం.
అయితే చర్చ అవసరం లేదంటూ ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించింది తెలంగాణ ప్రభుత్వం. రెండు రోజులుగా ముఖ్యమంత్రుల సమావేశంపై తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ సాగుతోంది. లేనిపోని అనుమానాలకు తావివ్వడం ఇష్టం లేక తెలంగాణ ప్రభుత్వం చర్చకు నో చెప్పినట్లు సమాచారం.
పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, పాలమూరు, డిండి ప్రాజెక్టులకు జాతీయ హోదాపై తెలంగాణ ఎజెండా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీలు కేటాయించాలని అజెండాగా పేర్కొంది తెలంగాణ ప్రభుత్వ.
200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మించాలని ప్రతిపాదించింది. గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించడం అనుచితమని, ఇలాంటి చర్యలతో కేంద్రప్రభుత్వ నియంత్రణ సంస్థలపై నమ్మకం పోతుందని పేర్కొంది.
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయమై చర్చించేందుకు ఏపీ-తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సోమవారం సమాచారం ఇచ్చారు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్. ఢిల్లీలోని జలశక్తి శాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం సమావేశం జరుగుతుందని పేర్కొంది.
ఈ అంశంతోపాటు రాష్ట్రాల తరఫున మాట్లాడాల్సిన ఇతర అంశాలు ఏమైనా ఉంటే వెంటనే పంపాలని జల శక్తి శాఖ కోరింది. బనకచర్లపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ అజెండా ఇచ్చింది. బనకచర్లపై సింగల్ అజెండా ఇవ్వడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వాస్తవానికి ఈ నెల 11న సమావేశం నిర్వహించాలని భావించింది జలశక్తి శాఖ.
ఏపీ పునర్విభజన చట్టం మేరకు జల వివాదాలకు సంబంధించిన అంశాలను కేంద్ర జలశక్తి మంత్రి ఛైర్మన్‌గా, రెండు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉంటారు. ఎపెక్స్ కౌన్సిల్ లో రాష్ట్రాలకు సంబంధించి అంశాలపై చర్చించాల్సి ఉంది. దశాబ్దం పాటు రెండు సమావేశాలు జరిగాయి. గోదావరి వరద జలాలను వినియోగించు కొనేందుకు బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది ఏపీ ప్రభుత్వం.
అయితే ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది తెలంగాణ ప్రభుత్వం . దీనిపై కేంద్రమంత్రిని కలిసి అభ్యంతరం వ్యక్తంచేశారు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దంటూ లేఖలు రాసిన విషయం తెల్సిందే.