అసెంబ్లీ ఎన్నికల సంసిద్ధత కోసం బీహార్ లో ఎలక్షన్ కమిషన్ (ఈసీ) చేపట్టిన ఓటర్ జాబితా సవరణ సర్వేలో పలు షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. బీహార్ లో అక్రమంగా నివాసం ఉంటున్న పలువురు బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ పౌరులు కూడా ఓటు హక్కు పొందారని తేలింది. ఓటర్ జాబితాలో వారి పేర్లు ఉన్నాయని ఈసీ అధికారులు చెబుతున్నారు. ఆగస్టు 1 నుంచి ఇలాంటి అనర్హుల పేర్లను ఓటర్ జాబితాలో నుంచి తొలగిస్తామని పేర్కొన్నారు.
ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఈ సర్వేపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, ఈసీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించాయి. అనర్హుల పేరుతో ప్రతిపక్షాల ఓటు బ్యాంకును ఓటర్ జాబితా నుంచి తొలగించేందుకే ఈ సర్వే చేపట్టిందని ఆరోపించాయి. ఈ విషయంపై అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈసీ చేపట్టిన సర్వే రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. ఎన్నికల ముందు సర్వే చేయడంపై ఈసీని ప్రశ్నించింది.
