AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నాపై అందుకే దాడి చేశారు.. మల్లన్న సంచలన వ్యాఖ్యలు..!

మేడిపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు ఆయన కార్యాలయంపై దాడి చేశారు.  ఈ దాడిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత, ఆమె కుటుంబం తనపై హత్యాయత్నానికి కుట్ర పన్నినట్టు సంచలన ఆరోపణలు చేశారు.

నా చేతికి గాయమైంది..

ఇలాంటి దాడులతో బీసీ ఉద్యమం ఆగిపోతుందనుకుంటే అది భ్రమేనని తీన్మార్ మల్లన్న అన్నారు. ఈ రోజు ఉదయం 11:30 గంటల ప్రాంతంలో దాదాపు 30 మందికి పైగా అనుచరులు తమపై దాడికి పాల్పడ్డారని చెప్పారు. తమ గన్ మెన్లు ఎంత అడ్డుకున్నా వినకుండా ఆఫీస్ లోపలికి వచ్చారని పేర్కొన్నారు. కవిత అనుచరుల దాడిలో తన చేతికి గాయమైందని అన్నారు. తన గన్ మెన్ నుంచి గన్ లాక్కొని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ విధంగా దాడులు చేసినంత మాత్రాన బీసీలు, అణగారిన వర్గాలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాము చేసే ప్రయత్నం ఏమాత్రం తగ్గదని తీన్మార్ మల్లన్న క్లారిటీ ఇచ్చారు. ఇక నుంచి మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తామని అన్నారు. ఇలాంటి పిరికిపంద చర్యలకు భయపడేది లేదని.. రాసిపెట్టుకోండి.. రాబోయే మూడేళ్లలో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత తమదే అని ఆయన చెప్పుకొచ్చారు.

మీరే దాడి చేసి.. మీరే ఫిర్యాదు చేస్తారా?

కవిత వ్యాఖ్యలకు తీన్మార్ మల్లన్న కౌంటర్ ఇచ్చారు. ‘మీరే దాడి చేసి మీరే ఫిర్యాదు చేస్తారా..? నా ఏథిక్స్ తో నాపై దాడికి పంపించారు. బీసీలపై దాడి చేయమని కవితనే ప్రోత్సహించారు. రేపటి నుంచి బీసీల తడాఖా ఏంటో చూపిస్తాం. నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా. బీసీ ఉద్యమంతో కవితకు సంబంధం లేదు. కంచం-మంచం అనేది తెలంగాణలో ఊతపదం. దాడి చేసి మళ్లీ నాపైనే ఫిర్యాదు చేశారు’ అని తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.

కవితకు ఎందుకింత బాధ..?

బీసీల సమస్యల కోసం ప్రభుత్వం పోరాడేందుకు మేం ఎప్పుడు సిద్ధమయ్యాం. ఆ దిశగానే పోరాడుతున్నామని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మా సలహాలను స్వీకరిస్తోందని.. పొరపాట్లు జరిగితే సరిచేసుకుంటోందని అన్నారు. ఈ విషయంలో కవితకు ఎందుకింత బాధ అని ప్రశ్నించారు. ఉనికి కోసమే అయితే కేసీఆర్ ను అడగాలని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ పై ఉన్న ఫ్రస్టేషన్ మాపై చూపిస్తానంటే ఎలా అని నిలదీశారు.

కవిత ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి..

పదేళ్లు కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుతిన్నదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి దాడులు జరిపి మరింత దిగజారి ప్రజల్లో చులకన కావడం తప్ప ఇంకేమీ లేదని అన్నారు. ఓ సహచర ఎమ్మెల్సీపై దాడులకు ప్రేరేపించిన కవిత ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని వెంటన రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ ఆఫీసులో పడిన రక్తపు మరకల సాక్షిగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తామని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు.

ANN TOP 10