కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ పార్టీలో తాను చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై గోషామహల్ శాసనసభ్యుడు రాజాసింగ్ స్పందించారు. ఏ పార్టీలో చేరాలనే విషయంపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. తాను అధికార, ప్రతిపక్ష పార్టీలలో చేరనున్నట్లు కొన్ని మీడియా ఛానళ్లలో ప్రచారం సాగుతోందని, అలాంటి తప్పుడు కథనాలను వ్యాప్తి చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక తీరును నిరసిస్తూ రాజాసింగ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం ఆమోదించారు. ఈ క్రమంలో ఆయన ఏ పార్టీలో చేరుతారనే చర్చ జరుగుతోంది.