తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఎక్సైజ్ శాఖలో కీలక స్థానంలో పనిచేసిన రిటైర్డ్ అధికారి డాక్టర్ రజత్ భార్గవకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. శుక్రవారం విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో సిట్ స్పష్టం చేసింది.
అయితే, నేటి విచారణకు డాక్టర్ రజత్ భార్గవ హాజరు కావడం లేదు. ఈ విషయాన్ని ఆయన సిట్ అధికారులకు తెలియజేశారు. శుక్రవారం విచారణకు రాలేనని, వచ్చే వారం హాజరవుతానని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. తన ఆరోగ్యం బాగోలేదని, చికిత్స పొందుతున్నానని, విచారణకు హాజరయ్యేందుకు తగిన సమయం ఇవ్వాలని కోరారు. అయితే, సిట్ అధికార వర్గాలు మాత్రం ఆయన విచారణకు హాజరవుతారని భావిస్తున్నాయి.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సేకరణ, పంపిణీ, ధరల నిర్ణయంలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సిట్ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అప్పట్లో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రజత్ భార్గవ పాత్రపై కూడా సిట్ దృష్టి సారించింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు ప్రముఖులను విచారించి, కొందరిని అరెస్టు చేసిన సిట్.. ఇప్పుడు సీనియర్ బ్యూరోక్రాట్ అయిన రజత్ భార్గవకు కూడా నోటీసు జారీ చేసి విచారణకు పిలవడం చర్చనీయాంశమైంది.