AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హిందీ భాష పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు..!

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ఐటీ రంగంలో విజయం సాధించడానికి ఆంగ్లం ఎంత ముఖ్యమో, దేశంలో ఎక్కువ మంది మాట్లాడే హిందీని నేర్చుకోవడం వల్ల కూడా అంతే ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన రాజ్య భాషా విభాగ స్వర్ణోత్సవ వేడుకల్లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, దక్షిణ భారతీయ సినిమాలలో 31 శాతం హిందీ డబ్బింగ్ ద్వారానే ఆదాయం వస్తుందని గుర్తు చేశారు. వ్యాపారానికి హిందీ అవసరమైనప్పుడు, నేర్చుకోవడానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.

 

తన సినిమాలో “ఏ మేరా జహా” అనే హిందీ పాట పెట్టడానికి గల కారణాన్ని వివరిస్తూ, మాతృభాష తెలుగు అయినప్పటికీ, హిందీ దేశ భాష అని చెప్పడానికే అలా చేశానని తెలిపారు.

 

హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదని, మరింత బలపడటమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. మరో భాషను అంగీకరించడం ఓటమి కాదని, కలిసి ప్రయాణించడమని ఆయన ఉద్ఘాటించారు. విద్య, వైద్యం, వ్యాపారం, ఉపాధి వంటి రంగాలలో భాషా అవధులు చెరిగిపోతున్న ఈ సమయంలో హిందీని వ్యతిరేకించడం రాబోయే తరాల అభివృద్ధిని అడ్డుకోవడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

 

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి మాతృభాషల పట్ల గౌరవం ఉండాలని చెబుతూనే, హిందీని పెద్దమ్మ భాషగా అభివర్ణించారు. ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉండగా, దేశ సరిహద్దులు దాటితే హిందీ రాజ్య భాషగా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచం విడిపోవడానికి కారణాలు వెతుకుతుంటే, భారతదేశం మాత్రం ఒకే భాషతో ఏకం కావాలని చూస్తోందని, అది హిందీతో సాధ్యమవుతుందని ఆయన అన్నారు.

 

ఒక బెంగాలీ గీతం జాతీయ గీతమైందని, ఒక పంజాబీ దేశం కోసం పోరాడారని, రాజస్థాన్‌కు చెందిన రాణప్రతాప్ శౌర్యానికి చిహ్నంగా నిలిచారని, తమిళనాడుకు చెందిన అబ్దుల్ కలాం మిస్సైల్ మ్యాన్ అయ్యారని, మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన వ్యక్తి రూపొందించిన మువ్వన్నెల జెండా దేశానికి తిరంగా అయిందని ఆయన గుర్తు చేశారు. ప్రతి భాషా జీవ భాష, మాతృ భాష అయినప్పటికీ, రాజ్య భాష మాత్రం హిందీయేనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10