టీటీడీలో అన్యమతాలకు చెందిన ఉద్యోగులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వెయ్యి మందికి పైగా అన్యమతస్తులకు ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా ఆ ఆనవాయతీని ఎందుకు కొనసాగిస్తున్నారని అన్నారు. అన్యమతస్తులను వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తిరుమల వచ్చారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కరీంనగర్ లో ఇప్పటికే భూమిపూజ చేసిన స్థలంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని వెంటనే నిర్మించాలని బండి సంజయ్ కోరారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, ప్రశాంత వాతావరణంలో జీవించాలని ఆకాంక్షించారు. సనాతనధర్మ పరిరక్షణ కోసం అందరూ కలసికట్టుగా ఉండాలని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ధూపదీప నైవేద్యాలకు నోచుకోలేని పురాతన ఆలయాలను గుర్తించి, టీటీడీ నిధులను కేటాయించి వాటిని అభివృద్ధి చేయాలని కోరుతున్నానని అన్నారు. కొండగట్టు అంజన్న, ఇల్లందకుంట రామాలయం ఆలయాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు.
ఇతర మతస్తులు టీటీడీలో పనిచేస్తున్నందునే ఆచార వ్యవహారాల్లో తేడా వస్తోందని సంజయ్ అన్నారు. స్వామిపై నమ్మకంలేని వ్యక్తులకు జీతాలిచ్చి ఎందుకు పోషిస్తున్నారని ప్రశ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు సరికాదని అన్నారు. బొట్టు పెట్టుకుని వెళితే మసీదులు, చర్చిల్లో ఉద్యోగాలు ఇస్తారా అని ప్రశ్నించారు.