AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైడ్రా ఎఫెక్ట్.. జలకళ సంతరించుకున్న బతుకమ్మ కుంట..

ఒకప్పుడు చెత్తాచెదారం, నిర్మాణ వ్యర్థాలతో నిండిపోయి కనుమరుగైన బాగ్‌ అంబర్‌పేట్‌లోని బతుకమ్మ కుంట ఇప్పుడు జలకళతో ఉట్టిపడుతోంది. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే హైదరాబాద్‌ లేక్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (హైడ్రా) అధికారులు చెరువు రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు సుదీర్ఘకాలం చేసిన పోరాటం, న్యాయస్థానం జోక్యంతో ఈ అభివృద్ధి పనులు సాధ్యమయ్యాయి.

 

ప్రభుత్వ రికార్డుల ప్రకారం 14 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు, కాలక్రమేణా కబ్జాలకు గురై కేవలం 5.15 ఎకరాలకు పరిమితమైంది. దీని పరిరక్షణ కోసం వీహెచ్ పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చివరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ దృష్టికి తీసుకెళ్లడంతో పనుల్లో కదలిక వచ్చింది. ఓ వ్యక్తి ఈ స్థలం తనదంటూ కోర్టును ఆశ్రయించినా, అది చెరువేనని హైకోర్టు స్పష్టం చేయడంతో అడ్డంకులు తొలగిపోయాయి.

 

దీంతో రూ.7 కోట్ల వ్యయంతో హైడ్రా అధికారులు అభివృద్ధి పనులు చేపట్టారు. చెరువులో పేరుకుపోయిన చెత్త, మట్టిని తొలగించి పూడిక తీస్తుండగా, భూగర్భ జలాలు ఒక్కసారిగా పైకి ఉబికివచ్చి చెరువును నింపేశాయి. ఇది డ్రైనేజీ నీరు కాదని, స్వచ్ఛమైన భూగర్భ జలమేనని వాటర్‌బోర్డు అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, పిల్లల పార్క్, ఓపెన్ జిమ్‌, బతుకమ్మ వేడుకల కోసం ప్రత్యేక వేదిక నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రానున్న సెప్టెంబర్‌ నాటికి, బతుకమ్మ పండగ సమయానికి చెరువును పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10