AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్, జగన్‌పై మరోసారి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు..

మాజీ ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం కారణంగా తెలంగాణకు పూడ్చలేని నష్టం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర రైతాంగానికి మరణశాసనంగా మారాయని ఆయన ఆరోపించారు. బుధవారం కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

“బేసిన్లు, బేషజాలు లేవంటూ కేసీఆర్ గతంలో అన్నారు. గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని కృష్ణా, పెన్నా బేసిన్లకు తరలించి రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పారు. ఇందులో భాగంగా జగన్‌కు సలహాలు ఇవ్వడమే కాకుండా, టెండర్లు, జీవోల విషయంలోనూ సహకరించారు” అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి వచ్చిన నీటిని వచ్చినట్లే ఒడిసి పట్టుకోవాల్సింది పోయి, ఏపీకి వెళ్లాక చివరిలో తీసుకోవడం వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయిందని ఆయన అన్నారు.

 

తుంగభద్ర, కృష్ణా జలాలు మొదట గద్వాలలోని జూరాలకు వస్తాయని, అక్కడే పాలమూరు-రంగారెడ్డి, నల్గొండ ప్రాజెక్టులకు నీటిని తరలించి ఉంటే ఏపీ జలాలను కొల్లగొట్టే అవకాశం ఉండేది కాదని రేవంత్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే కృష్ణా పరివాహక ప్రాంత రైతులు నష్టపోయారని అన్నారు.

 

“గత ప్రభుత్వం సరిగ్గా వాదించి ఉంటే హైదరాబాద్ తాగునీటి సమస్య తీరేది. అంతేకాకుండా, ప్రాజెక్టులలో రాష్ట్రానికి రావాల్సిన వాటా కోల్పోవడం వల్ల తక్కువ ధరకు లభించాల్సిన విద్యుత్‌ను కూడా కోల్పోయాం” అని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు మరణశాసనం రాసే హక్కు కేసీఆర్‌కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10