అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వాణిజ్య విధానాల్లో మరోసారి దూకుడు ప్రదర్శించారు. ఆసియాలోని కీలక మిత్రదేశాలైన జపాన్, దక్షిణ కొరియాల నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 25 శాతం మేర భారీ సుంకాలను విధిస్తున్నట్లు సోమవారం సంచలన ప్రకటన చేశారు. ఈ కొత్త టారిఫ్‌లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ మేరకు జపాన్, దక్షిణ కొరియా దేశాధినేతలకు ట్రంప్ వేర్వేరుగా లేఖలు రాశారు. “దురదృష్టవశాత్తు అమెరికాతో మీ వాణిజ్య సంబంధాలు పరస్పర ప్రయోజనకరంగా ఎంతమాత్రం లేవు” అని ఆ లేఖల్లో పేర్కొన్నారు. అమెరికా విధించిన సుకాలకు ప్రతిగా ఆ దేశాలు ఏమైనా చర్యలు తీసుకుంటే పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అయితే, తమ వాణిజ్య విధానాలను మార్చుకుంటే సుంకాలను తగ్గించే విషయాన్ని పరిశీలిస్తామని కూడా ఆయన ఒక అవకాశం ఇచ్చారు.
ట్రంప్ నిర్ణయంపై జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేశారు. వాణిజ్య చర్చల విషయంలో అంత సులభంగా రాజీపడే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఇదిలా ఉండగా, రానున్న 48 గంటల్లో మరికొన్ని వాణిజ్య ఒప్పందాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ తెలిపారు. “చాలా దేశాలు తమ వైఖరి మార్చుకున్నాయి. మాకు కొత్త ప్రతిపాదనలు వెల్లువెత్తుతున్నాయి” అని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
గతంలో ఏప్రిల్ 2న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్, ఆ తర్వాత మార్కెట్ల ఒత్తిడితో 90 రోజుల పాటు వాటిని నిలిపివేశారు. ఆ గడువు బుధవారంతో ముగియనుండగా తాజాగా ఆగస్టు 1 నుంచి సుంకాలు అమలవుతాయని ప్రకటించడం గమనార్హం. చైనాతో కూడా వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలోనే తన చైనా ప్రతినిధితో భేటీ అవుతానని బెస్సెంట్ వెల్లడించారు.