అమెరికాలో ప్రస్తుతం ఉన్న రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీలకు వ్యతిరేకంగా ‘అమెరికా పార్టీ’ పేరుతో ఒక కొత్త రాజకీయ శక్తిని ఏర్పాటు చేయనున్నట్లు ఎలాన్ మస్క్ తన సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. “ప్రజలకు వారి స్వేచ్ఛను తిరిగి ఇచ్చేందుకే ఈ రోజు అమెరికా పార్టీని ఏర్పాటు చేస్తున్నాం. దేశాన్ని వృథా, అవినీతితో దివాలా తీయిస్తున్న విషయంలో మనం ఏకపార్టీ వ్యవస్థలో ఉన్నాం” అని ఆయన ఆదివారం పోస్ట్ చేశారు.
ఎలాన్ మస్క్ కొత్త పార్టీ అంటూ ప్రకటన చేసిన తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్‌లో ప్రీమార్కెట్ సెషన్ ప్రారంభమైన వెంటనే టెస్లా షేర్ విలువ భారీగా పడిపోయింది. గతవారం మార్కెట్ ముగిసే సమయానికి 315.35 డాలర్లుగా ఉన్న షేరు ధర, ప్రీమార్కెట్‌లో 291.96 డాలర్ల వద్దకు పడిపోయింది. మస్క్ రాజకీయ ప్రవేశంపై నెలకొన్న అనిశ్చితి కారణంగానే ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ ఏడాది ఇప్పటివరకు టెస్లా షేర్లు 16.86 శాతం నష్టపోయాయి. గత ఐదేళ్లలో పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందించినప్పటికీ, మస్క్ తాజా రాజకీయ అడుగు మార్కెట్లో కొత్త ఆందోళనలకు దారితీసింది. డొనాల్డ్ ట్రంప్‌తో వివిధ అంశాలపై ఎలాన్ మస్క్ విభేదిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కొత్త పార్టీ ప్రకటన టెస్లా షేర్లపై ప్రతికూల ప్రభావం చూపింది.