నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన రెండో పెళ్లి గురించి వస్తున్న చర్చలకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు. మళ్లీ పెళ్లి చేసుకునేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని, అయితే ఆ నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం పడుతుందని ఆమె వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో తన వ్యక్తిగత జీవితంపై సాగుతున్న ఊహాగానాలకు ఆమె ప్రస్తుతానికి తెరదించారు.
పవన్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన పిల్లలు అకీరా నందన్, ఆధ్యాలతో కలిసి జీవిస్తున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె రెండో పెళ్లి అంశం తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందిస్తూ, “రెండో పెళ్లి చేసుకోవడానికి నేను మానసికంగా పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. కానీ, మరికొన్ని సంవత్సరాల పాటు వేచి చూడాలని నిర్ణయించుకున్నాను. నా జీవితంలో కూడా ఓ మ్యారేజ్ లైఫ్ ఉండాలని, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను” అని తెలిపారు.
ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని పిల్లల పెంపకానికే కేటాయిస్తున్నానని, వారి భవిష్యత్తుకే తన మొదటి ప్రాధాన్యత అని ఆమె తెలిపారు. సరైన సమయం వచ్చినప్పుడు పెళ్లి గురించి తప్పకుండా ఆలోచిస్తానని చెప్పడం ద్వారా వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించేందుకు తాను సానుకూలంగానే ఉన్నట్లు రేణు దేశాయ్ సంకేతమిచ్చారు.