AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కోరుట్ల చిన్నారి హత్య కేసులో ట్విస్ట్..!

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శనివారం రాత్రి జరిగిన ఐదేళ్ల చిన్నారి హితీక్ష హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చిన్నారి అదృశ్యమైన కొద్ది గంటలకే పక్కింటి బాత్రూమ్‌లో రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటన వెనుక కుటుంబ కలహాలే కారణమని, బాలిక సొంత పిన్ని మమతనే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు.

 

వివరాల్లోకి వెళ్తే, శనివారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన హితీక్ష, సమీపంలో జరుగుతున్న వినోద కార్యక్రమం చూసేందుకు వెళ్లింది. తిరిగివచ్చిన కాసేపటి తర్వాత, రాత్రి 7:30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ తర్వాత పాప కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లి నవీన, రాత్రి 8:30 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే గాలింపు చేపట్టిన పోలీసులకు, పక్కింటి బాత్రూమ్‌లో గొంతు కోయబడిన స్థితిలో చిన్నారి మృతదేహం లభ్యమైంది.

 

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. కుటుంబ సభ్యులను విచారించగా, కుటుంబంలో ఉన్న విభేదాలే హత్యకు దారితీసి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఉపాధి కోసం గల్ఫ్‌లో ఉన్న చిన్నారి తండ్రి రాములు, విషయం తెలిసి హుటాహుటిన స్వదేశానికి బయలుదేరారు.

 

కేసులో పోలీసులను వేధిస్తున్న ప్రశ్నలు

 

అయితే, ఈ కేసులో పోలీసులకు పలు చిక్కుముడులు ఎదురవుతున్నాయి. బాలిక మృతదేహం లభ్యమైన ఇంటి యజమాని కొడిపెల్లి విజయ్, తాను వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉన్నట్లు పోలీసులకు తెలిపాడు. విజయ్ ఊళ్లో లేకపోతే, బాలిక మృతదేహం అతని ఇంట్లోని బాత్రూమ్‌లోకి ఎలా వచ్చిందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

 

మరోవైపు, ఇది ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపులుల వేషాలను చూసి భయపడిన బాలిక, ఆ ఇంట్లోకి వెళ్లి బాత్రూమ్‌లో దాక్కుందా? ఆ సమయంలో ప్రమాదవశాత్తు నల్లాపై పడి మెడకు గాయమైందా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, సెల్‌ఫోన్ లోకేషన్లను విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే సుమారు 40 మందిని విచారించి, అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10