AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తిరుమల అన్నప్రసాద కేంద్రంలో ఇకపై రాత్రివేళ కూడా వడలు వడ్డింపు..

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఓ శుభవార్త అందించింది. ఇప్పటివరకు కేవలం మధ్యాహ్న భోజనంలో మాత్రమే అందిస్తున్న వడలను ఇకపై రాత్రి భోజన సమయంలో కూడా వడ్డించాలని నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అందించే భోజనంలో ఈ కొత్త మార్పును అమలు చేయనున్నారు. భక్తుల నుంచి వస్తున్న అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని, వారికి మరింత సంతృప్తికరమైన సేవలు అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిరంతరాయంగా భక్తులకు వేడివేడి వడలను అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ నిర్ణయం అమలు కోసం ప్రతిరోజూ సుమారు 70 వేల నుంచి 75 వేల వడలను ప్రత్యేకంగా తయారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రుచికరమైన, నాణ్యమైన వడలను భక్తులకు అందించేందుకు క్యాటరింగ్ విభాగం అన్ని చర్యలు తీసుకుంటోందని ఛైర్మన్ బీఆర్ నాయుడు వివరించారు.

ఇవాళ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో బీఆర్ నాయుడు స్వయంగా భక్తులకు వడలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతా రామ్, డిప్యూటీ ఈవో రాజేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10