AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో పలు రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షాక్..!

తెలంగాణలో పలు రాజకీయ పార్టీలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక చర్యలు చేపట్టింది. గత ఆరేళ్లుగా ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా, కేవలం రిజిస్టర్డ్ పార్టీలుగా మాత్రమే కొనసాగుతున్న 13 పార్టీలకు శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో స్పష్టమైన కారణాలతో వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో ఆదేశించింది.

 

రాష్ట్రంలో ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయి ఉండి ఆరేళ్లకు పైగా ఏ ఎన్నికల బరిలోనూ నిలవని పార్టీలను జాబితా నుంచి తొలగించాలని ఈసీ నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగానే 13 పార్టీలను గుర్తించి చర్యలు ప్రారంభించింది. సంబంధిత పార్టీలకు నోటీసులు అందించే బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు అప్పగించింది.

 

ఈ విషయంపై దినపత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇవ్వాలని కూడా జిల్లా అధికారులను ఆదేశించింది. ఆయా పార్టీల నుంచి వివరణ స్వీకరించిన తర్వాత, వాటి గుర్తింపును రద్దు చేయాలా వద్దా అనే దానిపై స్పష్టమైన సిఫార్సులతో కూడిన నివేదికను ఈ నెల 10వ తేదీలోగా సమర్పించాలని స్పష్టం చేసింది. జిల్లాల నుంచి అందిన నివేదికల ఆధారంగా తుది నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు.

 

నోటీసులు అందుకున్న పార్టీల వివరాలు

 

1. తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ (హన్మకొండ)

2. ఇండియన్ మైనారిటీస్ పొలిటికల్ పార్టీ (హైదరాబాద్)

3. జాగో పార్టీ (హైదరాబాద్)

4. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (హైదరాబాద్)

5. తెలంగాణ లోక్ సత్తా పార్టీ (హైదరాబాద్)

6. తెలంగాణ మైనారిటీస్ ఓబీసీ రాజ్యం (హైదరాబాద్)

7. యువ పార్టీ (హైదరాబాద్)

8. బహుజన్ సమాజ్ పార్టీ (అంబేద్కర్-ఫూలే) (మేడ్చల్ మల్కాజిగిరి)

9. తెలంగాణ స్టూడెంట్స్ యునైటెడ్ ఫర్ నేషన్ పార్టీ (మేడ్చల్ మల్కాజిగిరి)

10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ (రంగారెడ్డి)

11. జాతీయ మహిళా పార్టీ (రంగారెడ్డి)

12. యువ తెలంగాణ పార్టీ (రంగారెడ్డి)

13. తెలంగాణ ప్రజా సమితి (కిషోర్, రావు, కిషన్) (వరంగల్)

ANN TOP 10