AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆ లెక్కల్లో ఒక్కటి తగ్గినా కాళ్లు మొక్కి తప్పుకుంటాను.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, ఈ గణాంకాలపై చర్చకు ఎవరైనా రావొచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎవరైనా చర్చకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగాల సంఖ్యలో ఒక్కటి తగ్గినా తాను కాళ్ళు మొక్కి పదవి నుండి తప్పుకుంటానని అన్నారు.

 

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘సామాజిక న్యాయ సమరభేరి’ సభలో ఆయన మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో పార్టీ 100 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి తిరిగి అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ ఒక్క స్థానం తగ్గినా దానికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని ప్రకటించారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దికాలమే ఉంటుందని విమర్శించిన వారి అంచనాలను తలకిందులు చేస్తూ, పార్టీ నాయకులంతా ఐక్యంగా ప్రజాపాలన అందిస్తున్నారని తెలిపారు. కార్యకర్తలకు అన్ని పదవులు దక్కేవరకు తాను విశ్రమించబోనని హామీ ఇచ్చారు.

 

తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, 18 నెలల్లోనే రూ.1.04 లక్షల కోట్లు ఖర్చు చేసిందని రేవంత్ రెడ్డి వివరించారు. గత ప్రభుత్వం వరి వేస్తే ఉరి అన్నదని, కానీ తాము 2.80 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి దేశానికే ఆదర్శంగా నిలిచామని గుర్తు చేశారు.

 

రైతు భరోసా విషయంలో ప్రభుత్వం విఫలమవుతుందని కొందరు ఆశించారని, కానీ వారి ఆశలు నెరవేరలేదని అన్నారు. తాము ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలోనే కులగణన, ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలను పూర్తి చేశామని చెప్పారు. మూడు రంగుల జెండాతో కల్వకుంట్ల గడీల పాలనను కూల్చివేసి, ప్రతి హృదయాన్ని సృశిస్తూ పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10