AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హిమాచల్‌లో జల ప్రళయం.. 37 మంది బలి, భారీగా ఆస్తి నష్టం..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు హిమాచల్ ప్రదేశ్‌ను ముంచెత్తుతున్నాయి. ఈ ప్రకృతి బీభత్సంలో ఇప్పటివరకు 37 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ప్రాథమికంగా అంచనా వేసింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

ఈ విపత్తులో మండి జిల్లా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. ముఖ్యంగా తునాగ్ సబ్-డివిజన్‌లో రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. విద్యుత్, తాగునీటి సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఒక్క మండి జిల్లాలోనే సుమారు 40 మంది గల్లంతైనట్లు సమాచారం. అక్కడి ఒక గ్రామం పూర్తిగా నాశనమైందని అధికారులు తెలిపారు. బాధితుల కోసం సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి, భారత వైమానిక దళం హెలికాప్టర్ల ద్వారా ఆహార ప్యాకెట్లను జారవిడుస్తున్నారు.

 

రాష్ట్రవ్యాప్తంగా 250కి పైగా రోడ్లు మూసుకుపోగా, 500కు పైగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, సుమారు 700 తాగునీటి పథకాలు దెబ్బతిన్నాయి. మరోవైపు, సిమ్లాలోనూ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. “భారీగా వర్షం కురుస్తోంది. మా తరగతి గదుల్లోకి నీళ్లు వస్తున్నాయి. బట్టలు, పుస్తకాలు తడిసిపోతున్నాయి. ఇళ్ల దగ్గరే ఉండమని మా టీచర్లు చెబుతున్నారు. పాఠశాల చుట్టూ ఉన్న చెట్లు ఎప్పుడు కూలిపోతాయోనని భయంగా ఉంది” అని సిమ్లాకు చెందిన తనుజా ఠాకూర్ అనే విద్యార్థిని తన ఆవేదనను వ్యక్తం చేసింది.

 

రాష్ట్ర, కేంద్ర బలగాలు (ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్), పోలీసులు, హోంగార్డులు సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. 7వ తేదీ వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10