AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రెవెన్యూ శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి..! భూ సమస్యల పరిష్కారంలో జాప్యం..

రెవెన్యూ శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతుండటంపై అధికారుల తీరును ఆయన తప్పుబట్టారు. శుక్రవారం సచివాలయంలో రెవెన్యూ శాఖపై నిర్వహించిన కీలక సమీక్ష సమావేశంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. శాఖ పనితీరు పట్ల సీఎం ఏమాత్రం సంతృప్తిగా లేరని స‌మాచారం.

 

గత పాలకుల వైఫల్యాల కారణంగానే రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో భూ వివాదాలు, సర్వే సమస్యలు తీవ్రమయ్యాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. తహసీల్దార్ కార్యాలయాల్లో వేల సంఖ్యలో అర్జీలు పరిష్కారానికి నోచుకోకుండా పేరుకుపోవడంపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత రావాలంటే భూ సమస్యలను వేగంగా పరిష్కరించడం, సేవలను సులభతరం చేయడం అత్యంత కీలకమని ముఖ్య‌మంత్రి అభిప్రాయపడ్డారు.

 

మహానాడులో ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదిలోగా భూ సమస్యలను పరిష్కరించి తీరుతామని ఈ సందర్భంగా చంద్రబాబు పునరుద్ఘాటించారు. కేవలం పైపైన మార్పులు కాకుండా, క్షేత్రస్థాయి నుంచి రెవెన్యూ శాఖలో సమూల ప్రక్షాళన చేస్తే తప్ప ఫలితాలు రావని ఆయన భావిస్తున్నారు. సిబ్బంది కొరత, పనిభారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే, రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ సమీక్ష అనంతరం భూ సమస్యల పరిష్కారంపై సీఎం చంద్ర‌బాబు కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.

ANN TOP 10