దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం తాజాగా అమలులోకి తెచ్చిన “ఎండ్ ఆఫ్ లైఫ్” (EOL) వాహన విధానం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కొత్త నిబంధన కారణంగా ఓ వ్యక్తి తన ఎనిమిదేళ్ల లగ్జరీ ఎస్‌యూవీని అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, ప్రభుత్వ విధానంపై తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతోంది.
రితేష్ గాండోత్రా అనే వ్యక్తి తన ఆవేదనను ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. ఆయన 2018లో రూ. 55 లక్షలు పెట్టి రేంజ్ రోవర్ డీజిల్ కారును కొనుగోలు చేశారు. ఈ కారు కేవలం 74,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందని, చాలా జాగ్రత్తగా చూసుకున్నానని ఆయన తెలిపారు. “నా కారు వయసు 8 ఏళ్లు. కరోనా లాక్‌డౌన్ సమయంలో రెండేళ్ల పాటు పార్కింగ్‌లోనే ఉంది. ఇంకా రెండు లక్షల కిలోమీటర్లకు పైగా సులభంగా నడిచే సామర్థ్యం దీనికి ఉంది. కానీ, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలపై విధించిన నిషేధం వల్ల, ఇప్పుడు నేను నా కారును బలవంతంగా అమ్ముకోవాల్సి వస్తోంది. అదీ కూడా ఎన్‌సీఆర్ బయట ఉన్న వారికి, వారు అడిగిన చౌక ధరకే ఇవ్వాల్సి వస్తోంది” అని ఆయన వాపోయారు.
ఈ విధానం పర్యావరణ పరిరక్షణ కోసం కాదని, బాధ్యత గల యజమానులకు శిక్ష విధించడం లాంటిదని రితేష్ విమర్శించారు. “ఇది గ్రీన్ పాలసీ కాదు. బాధ్యతగా తమ వాహనాలను చూసుకునే యజమానులకు, ఇంగిత జ్ఞానానికి వేస్తున్న జరిమానా. దీనికి తోడు, ఇదే సెగ్మెంట్‌లో కొత్త కారు కొనాలంటే దానిపై 45 శాతం జీఎస్టీ, సెస్ రూపంలో అదనపు భారం పడుతోంది,” అని ఆయన పేర్కొన్నారు.
రితేష్ పోస్ట్ వైరల్ అవడంతో, నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. చాలా మంది ఈ విధానాన్ని ‘అన్యాయం’ అని అభివర్ణిస్తూ, వయసు ఆధారంగా గుడ్డిగా నిషేధం విధించడం కంటే ఆచరణాత్మక విధానాన్ని తీసుకురావాలని అధికారులను కోరుతున్నారు. ఒక వినియోగదారుడు స్పందిస్తూ, “ప్రధాని మోదీ గారు ఈ విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలి. ఢిల్లీలో పాత కార్లను నిషేధించే ఈ నిబంధనలో మార్పులు అవసరం. దీనిపై ఎవరూ సంతోషంగా లేరు” అని వ్యాఖ్యానించారు.
కాగా, ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (సీఏక్యూఎం) ఈ కొత్త నిబంధనలను జూలై 1 నుంచి అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం, 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు ఇంధనం నింపడాన్ని నిషేధించారు. ఈ వాహనాలు ఫిట్‌నెస్ పరీక్షలో పాసైనా ఈ నిబంధన వర్తిస్తుంది. నిబంధనలను ఉల్లంఘించే వాహనాలను గుర్తించేందుకు ఢిల్లీలోని పెట్రోల్ బంకులలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్‌పీఆర్) కెమెరాలను ఏర్పాటు చేశారు. సీఏక్యూఎం అంచనాల ప్రకారం, ఈ నిబంధనతో సుమారు 62 లక్షల వాహనాలు తుక్కుగా మారనున్నాయి