హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌కు ఏసీబీ అధికారులు మరోమారు నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ నోటీసులు జారీ చేశారు.
ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణకు సంబంధించిన కేసులో ఏసీబీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలో గురువారం ఉదయం 11:30 గంటలకు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని అర్వింద్ కుమార్‌కు పంపిన నోటీసులో పేర్కొన్నారు. ఈవెంట్ నిర్వహణలో ఆయన పాత్ర, ఇతర ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆయన్ను ప్రశ్నించే అవకాశం ఉంది.
గత నెల రోజుల పాటు అర్వింద్ కుమార్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన జూన్ 30వ తేదీన తిరిగి హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. ఆయన నగరానికి తిరిగి వచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు తాజాగా ఈ నోటీసులు జారీ చేయడం గమనార్హం. గతంలోనూ ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు విచారించి, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.