తెలంగాణ చరిత్రలో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ శివారులోని పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్ట్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతోంది. ప్రమాదంలో ఇప్పటివరకు 33 మంది మరణించారు. 47 మంది గల్లంతు అయ్యారు. 31 మృతదేహాలను వెలికి తీశారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొన్నారని అధికారులు చెబుతున్నారు. రియాక్ట్ పేలుడు సమయంలో దాదాపు 700 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని ఓ అంచనా. ఈ కారణంగా పని చేస్తున్నవారిలో చాలామంది సజీవ దహనమయ్యారు.
సోమవారం ఉదయం దాదాపు 10 గంటల సమయంలో భారీ శబ్దంతో రియాక్టర్ పేలిపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు పైఅంతస్తు ఒక్కసారిగా కుప్పకూలింది. ఉత్పత్తి చేస్తున్న భవనం పక్కనే ఉన్న మరో భవనం పాక్షికంగా డ్యామేజ్ అయ్యింది. క్వాలిటీ కంట్రోల్‌తోపాటు మరో విభాగానికి మంటలు చుట్టుముట్టాయి. ఘటన సమయంలో పరిశ్రమ ఆవరణలో 147 మంది కార్మికులు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మృతదేహాలను గుర్తుపట్టడానికి డీఎన్‌ఏ పరీక్షలు తప్పదని వైద్యులు అంటున్నారు. చనిపోయిన వారి కుటుంబసభ్యుల డీఎన్‌ఏలతో పోల్చి చూసిన తర్వాత గుర్తించాల్సి ఉంటుందని అంటున్నారు. అప్పటివరకు మృతదేహాల అప్పగింత సాధ్యం కాకపోవచ్చని కొందరు చెబుతున్నారు.
ఘటన జరిగిన స్థలంలో 17 మంది మృతి చెందారు. ఆసుపత్రిలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గుర్తు పట్టలేని స్థితిలో 20 మృతదేహాలు ఉన్నాయి. డిఎన్‌ఎ పరీక్ష తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు అధికారులు. మరో 27 మంది జాడ తెలియాల్సి వుంది. 35 మందికి తీవ్రగాయాలు కాగా అందులో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. సురక్షితంగా 57 మంది ఇళ్లకు చేరుకున్నారు. 64 మంది కార్మికులతోపాటు 22 మంది ఇతర సిబ్బంది, ముగ్గురు సెక్యూరిటీ అధికారులు క్షేమంగా బయటపడ్డారు.
గుజరాత్ కేంద్రంగా పని చేస్తోంది సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీ. ఈ కంపెనీకి తెలంగాణ తోపాటు మహారాష్ట్రల్లో పరిశ్రమలు ఉన్నాయి. పాశమైలారం పారిశ్రామికవాడలో నాలుగు ఎకరాల్లో ఔషధ తయారీ పరిశ్రమ ఉంది. ఈ ప్రాంతంలో ముడి సరకును శుద్ధి చేశారు. ఆ తర్వాత మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అనే ఔషధాన్ని తయారు చేస్తారు. వాటిని ఔషధ తయారీ సంస్థలకు విక్రయిస్తారు. ఈ పరిశ్రమలో నాలుగు బ్లాకులు ఉండగా, సెక్యూరిటీ విభాగం వెనుక ప్రొడక్షన్ విభాగం ఉంది. అందులో ఔషధాలు తయారీ చేస్తుంటారు. పైఅంతస్తులో క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. దాని పక్కనే అడ్మిన్ విభాగం ఉంది. ఇక్కడ పని చేస్తున్న సిబ్బందిలో ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే ఉంటారు.
స్ప్రేయర్ డ్రయ్యర్‌లో రసాయన ప్రక్రియ సమయంలో ఉష్ణోగ్రత అమాంతంగా పెరుగుతుంది. వేడిని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసేందుకు బ్లో ఎయిర్ హ్యాండ్లర్లను ఉపయోగిస్తారు.లేకుంటే స్ప్రేయర్ పని తీరు మరింత మందగిస్తుంది. ఎయిర్ హ్యాండ్లర్‌ను శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం కారణమని అంటున్నారు. దాని కారణంగా దుమ్ము పేరుకుందని, డ్రయ్యర్‌లో ఉష్ణోగ్రత అదుపులోకి రాకపోవడంతో పేలుడుకు దారి తీసినట్టు ప్రాథమిక అంచనా. దీనికితోడు స్ప్రేయర్ డ్రయ్యర్‌లో ముడి ఔషధాన్ని శుద్ధి చేయడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడుతారు. పేలుడుకు ఇది కూడా ఓ కారణమై ఉండవచ్చనేది వాదన సైతం లేకపోలేదు.