రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన దళితుడు సింగయ్య మృతి కేసు దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. పల్నాడు జిల్లా పర్యటనలో మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్‌లోని వాహనం కింద పడి సింగయ్య మరణించినట్లు చూపుతున్న వీడియోలు అసలైనవేనని ఫోరెన్సిక్ నిపుణులు ధ్రువీకరించారు. ఈ వీడియోలను మార్ఫింగ్ చేశారని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక అత్యంత కీలకంగా మారింది. సోమవారం పోలీసులకు అందిన ఈ రిపోర్టుతో కేసు విచారణలో నెలకొన్న అనుమానాలకు తెరపడింది.
అసలేం జరిగిందంటే?
గత నెల 18న వైఎస్ జగన్ పల్నాడు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పడిన జనసందోహంలో సింగయ్య అనే వ్యక్తి జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న వైసీపీ కార్యకర్తలు ఆయన్ను రోడ్డు పక్కకు లాగి వదిలేయడంతో సింగయ్య కాసేపటికే ప్రాణాలు విడిచారు. అయితే, తొలుత ఈ ఘటనపై పోలీసులకు తప్పుడు సమాచారం అందింది. వైసీపీ నేత దేవినేని అవినాశ్ అనుచరుడి వాహనం ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పడంతో పోలీసులు అదే విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
వీడిన మిస్టరీ
కొద్దిరోజుల తర్వాత సింగయ్య నేరుగా జగన్ వాహనం కింద పడి నలిగిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగింది. ఈ వీడియోలు మార్ఫింగ్ చేసినవని, రాజకీయంగా తమను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన జరిగిన ప్రదేశంలోని డ్రోన్, సీసీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. ర్యాలీని చిత్రీకరించిన పలువురు వైసీపీ కార్యకర్తల సెల్ ఫోన్లను కూడా సేకరించి, వాటిలోని వీడియోలను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపించారు.
ఇప్పటివరకు ఆరు ఫోన్ల నుంచి సేకరించిన వీడియోలను పరిశీలించిన ఫోరెన్సిక్ విభాగం, అవన్నీ ఒరిజినల్ వీడియోలేనని, ఎటువంటి మార్ఫింగ్ జరగలేదని స్పష్టం చేసింది. ఈ నివేదిక ఆధారంగా పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అదే సమయంలో ప్రమాదం జరిగినప్పుడు పోలీసులకు తప్పుడు సమాచారం అందించి, దర్యాప్తును తప్పుదోవ పట్టించిన వారిపై కూడా శాఖాపరమైన విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.