AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. చెవిరెడ్డి భాస్కరరెడ్డి పీఏలను అదుపులోకి తీసుకున్న సిట్..

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో అరెస్టయిన వైసీపీ ముఖ్య నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన అనుచరుడు వెంకటేశ్ నాయుడులను ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు కస్టడీలో విచారించనున్నారు. మరోవైపు, కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న చెవిరెడ్డి పీఏలు బాలాజీ, నవీన్‌లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

 

ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి ఏపీ సరిహద్దులకు రూ.8.20 కోట్లు బాలాజీ తీసుకొచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో ఎన్నికల సంఘం ఆ సొమ్మును స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో చెవిరెడ్డి పేరు వెలుగులోకి రావడంతో ఆయన పీఏలుగా పనిచేసిన బాలాజీ, నవీన్‌లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

 

అయితే, వారు ఇండోర్ నుంచి ఏపీలోని వైసీపీ నేతలకు ఫోన్లు చేస్తుండటంతో, సెల్ సిగ్నల్ లొకేషన్ ఆధారంగా సిట్ పోలీసులు వారి ఆచూకీని కనుగొన్నారు. సిట్ అధికారులు ఇండోర్‌కు వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు.

 

గతంలో బాలాజీని పోలీసులు అరెస్టు చేశారని, కోర్టులో వైసీపీ నేతలు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తమ అదుపులో లేరని అప్పట్లో సిట్ బృందం కోర్టుకు తెలిపింది. అప్పటి నుంచి బాలాజీ, నవీన్‌ల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిన సిట్ అధికారులు ఎట్టకేలకు ఇండోర్‌లో వారిని అదుపులోకి తీసుకున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10