సోలార్ విద్యుత్ పరిశ్రమ కోసం ఉలవపాడు వద్ద చేపట్టిన బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడలోని దాసరి భవన్‌లో నిన్న పది వామపక్ష పార్టీల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జులై 9న చేపట్టనున్న సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. అలాగే ఉలవపాడు వద్ద చేపట్టిన బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు చేపట్టిన నిరసనకు వామపక్ష పార్టీలు సంఘీభావం ప్రకటించాయన్నారు. జులై 2న ఆ గ్రామాల్లో పర్యటించి వారికి మద్దతుగా ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటామని తెలిపారు.
ప్రజలపై భారం పడే సోలార్ విద్యుత్ ఒప్పందాలను ఆదానీతో రద్దు చేసుకోవాలని, స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇండోసోల్, గ్రీన్ కో కంపెనీలు జగన్ బినామీలని ఆరోపించారు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ కంపెనీలకే భూములు కట్టబెట్టాలని చూడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.