గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ‘ఎక్స్’ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఒక పేరు ప్రచారంలోకి రావడంతో రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందజేశారు.
అనంతరం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, చాలామంది మౌనంగా ఉన్నంత మాత్రాన దానిని అంగీకారంగా భావించవద్దని పేర్కొన్నారు. “నేను నా ఒక్కడి గురించే మాట్లాడటం లేదు. మనల్ని నమ్మి, మన వెంట నిలిచిన లెక్కలేనంత మంది కార్యకర్తలు, ఓటర్ల తరఫున మాట్లాడుతున్నాను. వారంతా ఈరోజు తీవ్ర నిరాశకు గురయ్యారు” అని రాజాసింగ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. నమ్మకంతో పార్టీ వెంట నడిచిన కార్యకర్తలు, మద్దతుదారులు ప్రస్తుతం తీవ్ర నిరాశలో ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
తనను పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనివ్వలేదని అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని రాజాసింగ్ అంతకుముందు వెల్లడించారు. తన మద్దతుదారులను బెదిరించారని అన్నారు. బీజేపీ గెలవకూడదనే వాళ్లు పార్టీలో ఎక్కువయ్యారని అన్నారు. పార్టీ పదవుల్లో ‘నా వాడు, నీ వాడు’ అంటూ నియమించుకుంటూ వెళితే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు.