రాయలసీమకు గోదావరి జలాలను తరలించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ (ఈఏసీ) నిరాకరించింది. ప్రాజెక్టుపై ఇప్పటికే పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పలు కీలక సూచనలు జారీ చేసింది.
ట్రిబ్యునల్ తీర్పే ప్రధాన అడ్డంకి
పోలవరం నుంచి బనకచర్ల వరకు గోదావరి జలాలను తరలించే ఈ ప్రాజెక్టు ప్రతిపాదన 1983 నాటి గోదావరి జల వివాదాల ట్రైబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) తీర్పునకు విరుద్ధంగా ఉందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు కావాలంటే, ముందుగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)ని సంప్రదించి, అంతర్రాష్ట్ర జల పంపిణీపై స్పష్టత తీసుకురావాలని కమిటీ తేల్చిచెప్పింది. గోదావరిలో వరద నీటి లభ్యతపై కూడా సీడబ్ల్యూసీతో కలిసి శాస్త్రీయ అధ్యయనం చేయాలని సూచించింది.
సీడబ్ల్యూసీ అనుమతి కావాలి
బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతుల ఇవ్వలేమన్న కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ.. ఏపీ ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలపై కేంద్ర జలసంఘం సాయంతో వరద నీటి లభ్యతపై అధ్యయనం చేయాలని సూచించింది. అలాగే గోదావరి వాటర్ డిస్పూట్స్ ట్రైబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అలాగే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల పంపిణీపై సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి తీసుకోవాలని తెలిపింది.
రాయలసీమ ఆశలపై నీళ్లు
ప్రతి ఏటా సుమారు 3000 టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని, అందులోంచి 200 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించి, ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. సముద్రంలోకి వెళ్లే మిగులు జలాలను ఇరు రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే సుమారు రూ. 80,000 కోట్ల భారీ వ్యయంతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ప్రణాళికలు రచించారు.
తెలంగాణ తీవ్ర వ్యతిరేకత
అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టు గోదావరి ట్రిబ్యునల్ తీర్పుతో పాటు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని నిబంధనలకు కూడా విరుద్ధమని వాదిస్తోంది. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్ర నీటి హక్కులకు తీవ్ర భంగం వాటిల్లుతుందని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర నిపుణుల కమిటీ, ప్రాజెక్టుకు అనుమతులు నిరాకరించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై పర్యావరణ ప్రభావం, నీటి నిల్వ వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం జరిపిన తర్వాతే అనుమతుల విషయాన్ని పరిశీలించగలమని కమిటీ వెల్లడించింది.