AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జూలై 1 నుంచి కొత్త నిబంధనలు ఇవే..!

దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి పలు కీలక నిబంధనలు మారనున్నాయి. ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలు నుంచి క్రెడిట్ కార్డుల వినియోగం, రైల్వే తత్కాల్ టికెట్ల బుకింగ్ వరకు అనేక అంశాల్లో కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు సామాన్య పన్ను చెల్లింపుదారులు, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి ప్రధాన బ్యాంకుల కస్టమర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి.

 

పాన్, తత్కాల్ టికెట్లకు ఆధార్ తప్పనిసరి

 

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నిబంధనల ప్రకారం, మంగళవారం నుంచి కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ వివరాలను తప్పనిసరిగా ధృవీకరించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా జనన ధృవీకరణ పత్రం వంటి గుర్తింపు కార్డులతో పాన్ కార్డు పొందే వీలుండేది. ఇప్పటికే పాన్ కార్డు ఉన్నవారు ఈ ఏడాది డిసెంబర్ 31లోగా తమ ఆధార్ నంబరును అనుసంధానం చేసుకోవాలని సీబీడీటీ స్పష్టం చేసింది. ఈ నిబంధన పాటించని వారి పాన్ కార్డులు డి-యాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉంది.

 

అదేవిధంగా, రైల్వే తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాలన్నా ఆధార్ ధృవీకరణ తప్పనిసరి కానుంది. దీనితో పాటు, జూలై 15 నుంచి ఆన్‌లైన్ లేదా కౌంటర్లలో కొనుగోలు చేసే అన్ని రైలు టికెట్లకు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భాగంగా రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు వన్-టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) వస్తుంది. మరోవైపు, రైలు టికెట్ ధరలను కూడా స్వల్పంగా పెంచనున్నారు.

 

పన్ను చెల్లింపుదారులకు ఊరట

 

పన్ను చెల్లింపుదారులకు సీబీడీటీ కొంత ఊరట కల్పించింది. ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలుకు చివరి తేదీని జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. దీనివల్ల ఉద్యోగులకు తమ రిటర్నులను ఫైల్ చేయడానికి అదనంగా 46 రోజుల సమయం లభించింది.

 

క్రెడిట్ కార్డు ఛార్జీల్లో మార్పులు

 

ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు సేవలపై ఛార్జీలను సవరిస్తున్నాయి.

 

ఎస్బీఐ: తమ ఎలైట్, మైల్స్ ఎలైట్, మైల్స్ ప్రైమ్ వంటి ఎంపిక చేసిన ప్రీమియం కార్డులతో విమాన టికెట్లు కొనుగోలు చేస్తే అందించే ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నిలిపివేస్తోంది. అలాగే, నెలవారీ బిల్లులపై చెల్లించాల్సిన కనీస మొత్తం (MAD) లెక్కింపు విధానంలోనూ మార్పులు తీసుకురానుంది.

 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఇంటి అద్దె చెల్లించినా లేదా ఆన్‌లైన్ స్కిల్-బేస్డ్ గేమ్‌లపై రూ. 10,000కు మించి ఖర్చు చేసినా ఒక శాతం లావాదేవీ రుసుము విధిస్తుంది. ఈ రుసుము గరిష్ఠంగా రూ. 4,999గా ఉంటుంది. నెలకు రూ. 50,000కు మించి యుటిలిటీ బిల్లులు చెల్లించినా ఇదే రుసుము వర్తిస్తుంది. అయితే, ఇన్సూరెన్స్ లావాదేవీలకు దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. డిజిటల్ వ్యాలెట్‌లలో ఒకేసారి రూ. 10,000కు మించి లోడ్ చేసినా ఈ 1 శాతం రుసుము వర్తిస్తుంది.

 

ఐసీఐసీఐ బ్యాంక్: ఈ బ్యాంక్ కూడా ఏటీఎం లావాదేవీలతో సహా పలు సేవా ఛార్జీలను సవరిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంలలో మొదటి ఐదు లావాదేవీలు ఉచితం. ఆ తర్వాత నగదు విత్‌డ్రా చేస్తే ప్రతి లావాదేవీకి రూ. 23 ఛార్జ్ పడుతుంది.

 

ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో నగరాల్లో మూడు, ఇతర ప్రాంతాల్లో ఐదు ఉచిత లావాదేవీలు అందుబాటులో ఉంటాయి. ఆ పరిమితి దాటితే నగదు విత్‌డ్రాకు రూ. 23, నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలకు రూ. 8.5 చొప్పున వసూలు చేస్తారు.

 

అంతర్జాతీయ ఏటీఎంలలో నగదు విత్‌డ్రాకు రూ. 125, ఇతర లావాదేవీలకు రూ. 25, కరెన్సీ మార్పిడిపై 3.5 శాతం రుసుము ఉంటుంది. ఐఎంపీఎస్ ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బు బదిలీ చేసే ఛార్జీలను కూడా బదిలీ చేసే మొత్తాన్ని బట్టి రూ. 2.5 నుంచి రూ. 15 వరకు పెంచారు. క్యాష్ రీసైక్లర్ మెషీన్ల ద్వారా నెలకు మూడు ఉచిత లావాదేవీల తర్వాత ప్రతిసారీ రూ. 150 చెల్లించాలి. నెలకు రూ. 1 లక్షకు మించి నగదు డిపాజిట్ చేస్తే రూ. 150 లేదా ప్రతి రూ. 1,000కి రూ. 3.50 (ఏది ఎక్కువైతే అది) రుసుముగా విధిస్తారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10