AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ రథ యాత్ర నేడే..

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పూరీ జగన్నాథ రథయాత్ర శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ అపురూప ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీ క్షేత్రానికి పోటెత్తారు. దీంతో పూరీ వీధులన్నీ జనసంద్రంగా మారాయి. జై జగన్నాథ నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోతోంది. భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్న భక్తులు స్వామి వారి రథాలను లాగేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

 

ఏటా ఆషాడ మాస శుక్లపక్ష విదియ నాడు ఈ యాత్రను నిర్వహిస్తారు. ఈ తొమ్మిది రోజుల ఉత్సవంలో భాగంగా, జగన్నాథ స్వామి తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి 12వ శతాబ్దానికి చెందిన ప్రధాన ఆలయం నుంచి గుండిచా ఆలయానికి యాత్రగా వెళ్తారు. పురాణాల ప్రకారం గుండిచా ఆలయాన్ని స్వామి వారి జన్మస్థలంగా భక్తులు విశ్వసిస్తారు. సుమారు 3 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రలో భక్తులు జగన్నాథుడి రథమైన ‘నందిఘోష్’, బలభద్రుడి రథం ‘తాళధ్వజ’, సుభద్ర దేవి రథం ‘దర్పదళన్’లను స్వయంగా లాగుతారు.

 

భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. రథయాత్ర సందర్భంగా పూరీలో ఐదంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. 200 ప్లాటూన్ల పోలీసు బలగాలతో పాటు, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ వంటి కేంద్ర బలగాలకు చెందిన 8 కంపెనీలను మోహరించారు. ఈ ఏడాది యాత్ర కోసం పూరీ నగరం చుట్టూ సుమారు 10,000 మంది ఒడిశా పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు, హోంగార్డులు విధుల్లో ఉన్నారు.

 

ఈసారి భద్రతలో భాగంగా ఆధునిక సాంకేతికతను కూడా వినియోగిస్తున్నారు. ఉత్తరా స్క్వేర్ నుంచి పూరీ పట్టణం వరకు, అలాగే పూరీ నుంచి కోణార్క్ మార్గంలో దాదాపు 275 ఏఐ ఆధారిత సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ట్రాఫిక్, భక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు తొలిసారిగా ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాన్ని కూడా నెలకొల్పారు.

ANN TOP 10