మంచు విష్ణు (Manchu Vishnu) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కన్నప్ప (Kannappa). గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం మంచు విష్ణు, అతని చిత్ర బృందం ఎంతగా కష్టపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటు కుటుంబ గొడవలు జరుగుతున్నా.. ఆ ప్రభావం సినిమాపై పడకుండా ఎంతో పగడ్బందీగా ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ సినిమాపై మాత్రం ట్రోల్స్ ఆగడం లేదు అని చెప్పాలి. ముఖ్యంగా సినిమా అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి విడుదలకు కేవలం ఒకరోజు మాత్రమే మిగిలి ఉన్నా.. ఇంకా ట్రోల్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యంలో తాజాగా మంచు విష్ణు ట్రోలర్స్ కి అలాగే రివ్యూయర్స్ కి గట్టి వార్నింగ్ ఇస్తూ తమ నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ ద్వారా ఒక హెచ్చరిక నోటీసు జారీ చేశారు.
నెగిటివ్ రివ్యూ ఇస్తే కేస్ తప్పదు -మంచు విష్ణు
ముఖ్యంగా కన్నప్ప సినిమా ప్రజలను అలరించడానికి, భక్తిపారవశ్యంలో ముంచడానికి మాత్రమే తమ సినిమాను రూపొందించామని చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ఒక హెచ్చరిక నోటీస్ జారీ చేస్తూ.. అందులో. ” ముందుగా సినిమాను చూసి, దాని సారాంశాన్ని అర్థం చేసుకొని, ఆ ఉద్దేశాన్ని రివ్యూ రూపంలో ఇవ్వండి. ప్రతీకార వ్యాఖ్యలకు, పక్షపాతాలకు లొంగిపోకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. అలా లేని పక్షంలో కేసు తప్పదని హెచ్చరిక జారీ చేస్తూ.. నోటీస్ విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ హెచ్చరిక నోటీస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హెచ్చరిక నోటీసులో ఏముందంటే..
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై కన్నప్ప సినిమా జూన్ 27న శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాంబోతోంది. ఈ చిత్రం గణనీయమైన వాణిజ్య పెట్టుబడి, అవిశ్రాంత కృషికి నిదర్శనం. ఈ సినిమా విడుదలకు సాధ్యమైన అన్ని ధ్రువపత్రాలు, మేధో రక్షణ అనుమతులను పొందాము. కన్నప్ప చట్టబద్ధమైన, సృజనాత్మక సంస్థ ఫలితం అని కూడా మేము స్పష్టంగా చెబుతాముm ఈ సినిమాను బాధ్యతాయుతంగా, ప్రజలతో సన్నిహితంగా ఉండేలా రూపొందించబడింది. తద్వారా రివ్యూలు రాసే ప్రతి ఒక్కరు ముందుగా చిత్రాన్ని చూడాలి. దాని సారాంశాన్ని అభినందించాలని, ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని సూచిస్తున్నాము. ముఖ్యంగా ప్రతీకార , ఆవేశపూరిత వ్యాఖ్యానాలకు లొంగిపోకుండా, బాధ్యతాయుతంగా వ్యాఖ్యానించాలని కూడా గౌరవంగా అభ్యర్థిస్తున్నాము అంటూ తెలిపారు.
హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవు..
ఇకపోతే అదే నోటీస్ లో చట్టాల గురించి కూడా చెప్పుకొచ్చారు విష్ణు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) కింద భావ ప్రకటన స్వేచ్ఛ పవిత్రమైనదే మేము కాదనము.. కానీ అందులో న్యాయపరమైన వివరణలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇటీవల కేరళ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా.. అలాగే ముబీన్ రౌఫ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో కూడా హైకోర్టు గౌరవనీయమైన పరిశీలనలు జరిపిన తర్వాతనే సృజనాత్మక రచన పై ఉద్దేశపూర్వకంగా లేదా ప్రతి దాడి చేయడం భౌతికంగా లేదా ప్రతిష్టకు భంగం కలిగించే మాట్లాడడం న్యాయపరమైనది కాదు అని తెలిపింది. ఇలాంటి చర్యలపై కఠినమైన చర్యలు తీసుకునే హక్కు కూడా మాకుంది. అంటూ తెలిపారు.
సివిల్, క్రిమినల్ కేస్ కూడా..
ముఖ్యంగా సినిమా నిర్మాణ సమయంలో జరిగిన కొన్ని అవాంతరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బృందం అప్రమత్తమయింది. ఏదైనా వ్యక్తి లేదా ఒక సంస్థ సినిమాకి పాక్షికంగా లేదా పూర్తిగా ఆధారాలు లేకుండా పరువు నష్టం కలిగించి , సినిమాను లీక్ చేయడం లాంటివి చేస్తే ఖచ్చితంగా సివిల్, క్రిమినల్, సైబర్ అధికార పరిధితో సహా అన్ని ఫారంల ముందు తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటూ హెచ్చరికలు జారీ చేశారు మంచు విష్ణు. మొత్తానికి అయితే మంచు విష్ణు విడుదల చేసిన ఈ నోటీస్ అందరికీ గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ లాగా అనిపిస్తోందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.