AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు..! డెడ్ లైన్ విధింపు..!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా రేపో మాపో మోగనుంది. గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి బుధవారం తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు. మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 

గ్రామ పంచాయితీలకు గడువు ముగిసి ఏడాదిన్నర అయ్యింది. అయితే ఎన్నికల నిర్వహణలో జాప్యం ఎందుకు చేస్తున్నారని ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది హైకోర్టు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాలు చేస్తూ పలువురు మాజీ సర్పంచులు న్యాయస్థానం తలుపు తట్టారు.

 

దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం బుధవారం తన తీర్పు వెల్లడించింది. కేవలం మూడు నెలలు అంటే సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని జస్టిస్ మాదవి దేవి బెంచ్ వెల్లడించింది.

 

పిటిషనర్ల తరపు న్యాయవాదులు న్యాయస్థానం ముందు తమ వాదనలు వినిపించారు. 2024 జనవరి 31తో సర్పంచుల పదవీ కాలం ముగిసిందని కోర్టు దృష్టి తెచ్చారు. అయినా ఎన్నికలు నిర్వహించ కుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని వివరించారు. పంచాయతీల బాధ్యతను ప్రత్యేక అధికారులకు అప్పగించిన విషయాన్ని తెలిపారు. ప్రత్యేక అధికారులు ఇతర విధుల్లో ఉండటంతో ప్రజా సమస్యలను పట్టించుకోవడం వివరించారు.

 

ఆర్థిక సంఘం ద్వారా నిధులు సమకూరుస్తామని ప్రభుత్వం హామీతో పలువురు సర్పంచులు సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేయించారని, ఆ నిధులు రాక ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. వెంటనే ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని లేకుంటే పాత సర్పంచులకే బాధ్యతలు అప్పగించాలని అందులో ప్రస్తావించారు.

 

వెంటనే ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసిన ఆ ప్రక్రియ చేపట్టాల్సి ఉందన్నారు. అది పూర్తి కావడానికి నెల రోజుల గడువు అవసరమన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఎన్నికల నిర్వహణపై గతంలో ఒకసారి హామీ ఇచ్చారని, ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 

ఎన్నికల సంఘం తరపు సీనియర్‌ న్యాయవాది వాదనలు వినిపించారు. రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కోర్టు దృష్టికి తెచ్చారు. అది పూర్తి కాగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి రెండు నెలలు పడుతుందన్నారు. ఈలోగా న్యాయమూర్తి జోక్యం చేసుకున్నారు.

 

సకాలంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఎన్నికల సంఘం చొరవ తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పినందున ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దీనికి న్యాయవాది రిప్లై ఇచ్చారు. రిజర్వేషన్ల ఖరారుతో పాటు ఎన్నికలకు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. మూడు వర్గాల నుంచి వాదనలు విన్న న్యాయమూర్తి.. మూడు నెలల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. రిజర్వేషన్ల ప్రక్రియ కాగానే నోటిఫికేషన్ వెలువడడం ఖాయమని అంటున్నారు.

ANN TOP 10