AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పవన్ కల్యాణ్ పై తమిళనాడు మంత్రి ఫైర్..!

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల తమిళనాడులోని మధురైలో చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి, డీఎంకే నేత శేఖర్ బాబు తీవ్రంగా స్పందించారు. 2026 తమిళనాడు ఎన్నికల్లో చెన్నైలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసి గెలవగలరా అంటూ పవన్ కు ఆయన సవాల్ విసిరారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్ని చెప్పినా వినడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.

 

మధురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పవన్ పాల్గొని ప్రసంగించారు. “మురుగన్ నామస్మరణతో ఏ శత్రువైనా పారిపోతాడు” అనే ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్తూ, ధర్మ మార్గంలో పయనించాలని ఆయన పిలుపునిచ్చారు. వీరవేల్ మురుగన్‌పై ఆత్మవిశ్వాసంతో విజయం సాధించవచ్చని తెలిపారు. ‘ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చు. ఒక ముస్లిం కూడా వారి మతాన్ని గౌరవించవచ్చు. కానీ హిందువు తన మతాన్ని గౌరవిస్తే మాత్రం ఎందుకు అభ్యంతరం?’ అని ప్రశ్నించారు. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వంటి డీఎంకే నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఎంకేని ఉద్దేశించి పవన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

 

ఈ వ్యాఖ్యలపై స్పందించిన తమిళనాడు మంత్రి శేఖర్ బాబు… పవన్ కల్యాణ్ కు అసలు తమిళనాడుతో ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. “మమ్మల్ని ప్రశ్నించడానికి ఆయన ఎవరు?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మాయలో పడి మత రాజకీయాలను ప్రోత్సహించవద్దని పవన్‌కు హితవు పలికారు. తమ ప్రభుత్వం దేవదాయశాఖ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉందని, పవన్ మాటలను నమ్మడానికి తమిళ ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు.

ANN TOP 10