AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తల్లికి అస్వస్థత… కేబినెట్ మీటింగ్ నుంచి మధ్యలోనే హుటాహుటిన హైదరాబాద్ కు బయల్దేరిన పవన్ కల్యాణ్..

ఏపీ కేబినెట్ సమావేశం నుంచి ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్యలోనే వెళ్లిపోయారు. తన తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం అందడంతో ఆయన హుటాహుటిన హైదరాబాద్‌కు బయల్దేరారు.

 

ఈ ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పవన్ కూడా హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటు సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు.

 

సమావేశం జరుగుతుండగా, హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురైనట్టు పవన్ కు సమాచారం అందింది. దీంతో వెంటనే ఆయన ముఖ్యమంత్రికి ఈ విషయం తెలిపారు. పరిస్థితిని వివరించి, ఆయన అనుమతి తీసుకున్న అనంతరం పవన్ కేబినెట్ సమావేశం నుంచి బయటకు వచ్చి నేరుగా గన్నవరం ఎయిర్ పోర్టుకు పయనమయ్యారు.

 

పవన్ వెళ్లిపోయిన తర్వాత మిగిలిన మంత్రులతో కేబినెట్ సమావేశం యథావిధిగా కొనసాగింది. పలు కీలకమైన పాలనాంశాలు, హామీల అమలుపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.

ANN TOP 10