తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజీనామా చేస్తున్నారంటూ గురువారం ఉదయం నుంచి ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, పార్టీ మార్పు పై వస్తున్న వార్తలను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఖండించారు. నిరాధారమైన వార్తలతో కాంగ్రెస్ పార్టీని, తనను నమ్ముకున్న వారిని అయోమయంలో పడేయవద్దంటూ సూచించారు. పార్టీ మారేది ఉంటే నేనే ప్రకటిస్తానంటూ క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారతా అనే విషయాన్ని ఖండించడం కూడా బాధాకరంగా ఉందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. పార్టీ మారేవాడినే అయితే పీసీపీ పదవి ఇవ్వనప్పుడే పార్టీ మారేవాడినంటూ పేర్కొన్నారు.
పార్టీ అధిష్టానంపై కొన్ని కామెంట్లు చేసిన మాట వాస్తవమే.. సోనియా, రాహుల్ గాంధీతో చర్చల తర్వాత మనసు మార్చుకున్నానన్నారు. తన సేవల్ని పార్టీ కోసం ఉపయోగించుకుంటామని చెప్పారని.. కోమటిరెడ్డి తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రధానిని, కేంద్ర మంత్రులను కలుస్తున్నాను.. కావున పార్టీ మారుతున్నారన్న వార్తలు వచ్చాయి అనుకుంటున్నానని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి అని, బీఆర్ఎస్ లో చేరుతున్నానన్న వార్తలు కూడా చూస్తున్నాను.. ఎమ్మెల్యే, మంత్రి పదవి వదలి తెలంగాణ కోసం పోరాడానంటూ కోమటిరెడ్డి తెలిపారు. నిన్న తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ థాకరేతో రాష్ట్ర కాంగ్రెస్ వ్య్వహారాలపై చర్చించానని.. పార్టీ టికెట్లు త్వరగా ఇవ్వాలని గెలిచే అభ్యర్థులకు ఇవ్వాలని కోరానన్నారు. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలోనూ త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని కోరానని తెలిపారు.